ప్రతిరోజు ప్రజలు ఏదో విధంగా ప్రమాదాల్లో గాయపడుతున్నారు. ప్రమాదాల్లో అతి ముఖ్యమైనవి అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆదుకోవడం, వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవడానికి అవగాహనకై ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న “ప్రపంచ ట్రామా డే” ను హాస్పిటల్స్, స్వచ్ఛంద సంస్థలు వర్క్ షాపులు నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రతి రోజు 400 మంది మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గాయపడిన సంఘటనల్లో జరిగే ప్రాణ నష్టం నివారించడానికి మొట్ట మొదటిసారిగా 2011 సంవత్సరంలో న్యూ ఢిల్లీ లో ప్రపంచ ట్రామా డే నిర్వహించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 50 లక్షల కంటే ఎక్కువ మంది గాయాల కారణంగా మరణిస్తున్నారు. ఇది మొత్తం మరణాల్లో 9 శాతం. ఏటా భారత దేశంలో 10 లక్షల మంది గాయాల కారణంగా చనిపోతున్నారని, మరో రెండు కోట్ల మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఒక అంచనా మాత్రమే. గాయాలకు ముఖ్య కారణం రోడ్డు ప్రమాదాలని అందరికీ తెలుసు. ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వాటిలో ఎక్కువగా యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాదాల్లో 11 శాతం భారత దేశంలోనే జరుగుతున్నాయి. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో 13 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా 50 లక్షల మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు మితి మీరిన వేగం, అధిక లోడ్ తో భారీ వాహనాల ప్రయాణం, యువతి, యువకులు ఛేజింగ్, పందేరాలు, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, వాహనం నడిపేటప్పుడు చరవాణిలో మాట్లాడటం, సంగీతం వినడం వలన తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకులు నిరంతరంగా మూడు, నాలుగు గంటలు వాహనం నడపటం వలన వారికి తెలియకుండా “రోడ్ హిప్నాసిస్” స్థితికి చేరుకుంటారు ఆ స్థితిలో వారు కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ మెదడు కంటికి కనిపించే వాటిని రికార్డ్ చేయకపోవడంతో అతను నడిపే వాహనం ఎంత వేగంతో పయనిస్తుందో తెలుసుకోలేని స్థితిలో ఉండటంతో ముందు వెళ్లే వాహనాన్ని ఢీ కొట్టడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలసటగా ఉన్నా కానీ, నిద్ర వచ్చిన కానీ వెంటనే వాహనం నడపకూడదు. కాలం చెల్లిన వాహనాలు, బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా లేని, ఎయిర్ బాగ్స్ లేని వాహనాలు నడపకూడదు. రవాణా శాఖ అధికారులు గుంతలు లేని రహదారులు, సిగ్నల్స్ వ్యవస్థను పటిష్టపరచి, నెమ్మదిగా నడిచే, వేగంగా నడిచే వాహనాలు, భారీ వాహనాలకు ప్రత్యేక లైన్లు, జంక్షన్లు, విశాలంగా వెలుతురు ఉండేటట్లుగా చూడటం, ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డ వారికి త్వరగా వైద్య చికిత్స కొరకు హైవేలలో ట్రామా సెంటర్స్ నిర్మించాలి. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలి.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.