భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమ మతాచారాల ప్రకారం పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. ప్రత్యేకంగా దసరా నవరాత్రులలో పూల పండుగ “బతుకమ్మ” గొప్పగా ఆడపడచులు జరుపుకుంటారు. తెలంగాణా రాష్ట్రంలో విభిన్న రాష్ట్రాల నుంచి వలస వచ్చిన బిహారీలు ఛట్ పూజ, బెంగాళీలు దుర్గా పూజ, మలయాళీలు ఓనమ్, మరాఠీలు గుడ్ పావ్, గణేష్ చవితి ,ఒడిశా వారు జగన్నాథ్ రథయాత్ర జరుపుకుంటారు. దాదాపు 400 సంవత్సరాల క్రితం శ్రీ భగవద్రామానుజులు వారు స్థాపించిన శ్రీ వైష్ణవ మత వ్యాప్తి కొరకు తమిళనాడులోని శ్రీవైష్ణవుల దివ్య క్షేత్రం శ్రీరంగం, కాంచీపురం నుంచి ఆళ్వారుల సంతతి కి చెందిన వైష్ణవ గురువులు కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రజలకు వైష్ణవత్వం బోధిస్తూ వారిని శిష్యులుగా గుర్తించి మంత్రోపదేశం చేయడంతో అట్టి శిష్యులు గురుదక్షిణ క్రింద వైష్ణవ గురువులకు భూమి దానం చేయడంతో అట్టి భూమి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం కొనసాగిస్తూ వచ్చారు. ఈ వైష్ణవ గురువులలో శ్రీ కూరత్తళ్వార్ సంబంధికులు శ్రీ వేద వ్యాస, శ్రీ పరాశర, ఆళవందార్, మఠతమ్మాళ్, తిరునంతల్వార్, అమ్మింగి అమ్మాళ్, కిడాంబి వంశస్తులు ఈ శరన్నవరాత్రులు విభిన్న రీతిలో జరుపుకుంటారు. ప్రస్తుతం ఈ కుటుంబాలు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నివసిస్తున్నారు. ఈ వేదవ్యాస వంశస్తుల్లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లిలో జన్మించిన వారిలో చలన చిత్ర రచయిత దర్శకులు జె.కె భారవి, శ్రీ రంగ భట్టర్ ముఖ్యులు. తెలంగాణ రచయితలు దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు కూడ శ్రీ వైష్ణవ మతస్తులే. ఆశ్వయుజ పాడ్యమి నాడు వారి ఇండ్లలో చెక్క బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకొని ఉదయం, సాయంత్రం అట్టి బొమ్మల కొలువుకు హారతి ఇస్తూ, దేవత మూర్తులకు పిండి వంటలలో మొదటి రోజు ఒబ్బట్లు, రెండవ రోజు చక్కెర పొంగలి, మూడవ రోజు పులిహోర, దద్దోజనం, నాల్గవ రోజు పాయసం బజ్జిలు, ఐదవ రోజు మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ రోజు కుడుములు, ఆరవ రోజు లడ్డులు, ఏడవ రోజు పప్పు గారెలు, పాయసం, మహర్నవమి రోజు మహాలక్షి పూజ నిర్వహించి బొబ్బట్లు, విజయ దశమి రోజు ఇస్టమైన తీపి వంటలు నైవేద్యం చేసి ప్రతి రోజు ముత్తైదువులను పేరంటాలకు పిలిచి తాంబూలం ఇచ్చి వైభవంగా జరుపుకుంటున్నారు. విజయ దశమి తరువాతి రోజున శ్రావణ నక్షత్రం రోజు బంధువులను, స్నేహితులను పిలిచి వాయనం ఇచ్చి చెక్క దేవత బొమ్మల కొలువులకు ఉద్వాసన పలికి, తరతరాలుగా వస్తున్న వారి ఆచారాలు, సంప్రదాయాలను మరువుకుండా జరుపుకోవడం వీరి ప్రత్యేకత. ఇట్టి చెక్క దేవత బొమ్మలను నూతనంగా వివాహం అయ్యి అత్తారింటికి వెళ్లేటప్పుడు నూతన వదువు చీర ఒడిలో ఉంచి ఆనవాయితీ కొనసాగించమని వధువు తల్లిదండ్రులు చెబుతారు. నేటి తరానికి భక్తి అందిస్తూ పండుగలు జరుపుకోవడం శ్రీ వైష్ణవుల కుటుంబాల ప్రత్యేకత. ఇలాంటి విభిన్నరీతిలో తమిళులు వారి సంప్రదాయం ఇంకను కొనసాగించడానికి తెలంగాణ ప్రజల ఆదరణ, ఆప్యాయతలే ప్రధాన కారణం.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్