తెలంగాణ రాష్ట్ర శాసన సభకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముచ్చటగా మూడవ సారి ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు, గ్యారంటీ పథకాలు, రుణ మాఫీలు చేస్తామని బస్సు యాత్ర, పాదయాత్రలలో ఎన్నో హామీలు, ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఏ లు వేతన సవరణలు, ఆరోగ్య బీమా లాంటివి అమలు పరుస్తామని హామీలు ఇస్తున్నాయి. సింగరేణి గనుల ప్రాంతాల్లో దాదాపు 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి కార్మికుల ఓట్లను రాబట్టేందుకు నూతన వేతన సవరణ, లాభాల వాటా, బోనస్ లాంటివి వెంట వెంటనే అమలుపరిచారు. జాతీయ నాయకులు, ప్రాంతీయ నాయకులు కార్మికులతో సెల్ఫీలు, ఫోటోలు దిగి వారిని వినోద పరుస్తున్నారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణకు అడ్డుకట్టవేస్తామని చెబుతున్నారు. కానీ సింగరేణి 1991లో నష్టాల్లో బిఎఫ్.ఐ.ఆర్ కు వెళ్ళినప్పుడు సంస్థకు లాభాలు రావాలని కష్టపడ్డ కార్మికులు నేడు పదవి విరమణ చేసి ఉన్నారు. అట్టి రిటైర్డ్ కార్మికులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం కనీస పెన్షన్ 350 రూపాయలకు నిర్ణయించబడి 25 సంవత్సరాలు గడిచినప్పటికీ అంతే చెల్లిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్లు పెంచుకుంటూ పోతున్నారు. అలాగే ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి పెంచుతున్నారు. కానీ, సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ నయా పైసా పెంచకపోవడంతో చాలా మంది దారిద్య్ర రేఖ కన్నా దిగువన జీవనం గడుపుతున్నారు. రిటైర్ అయిన తరువాత వారికి ఇచ్చిన మెడికల్ కార్డ్ ద్వారా ఎటువంటి ఔట్ పేషెంట్ వైద్యం అందకపోవడం, సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యం స్వీకరిస్తే మెడికల్ కార్డ్ నుంచి నగదు కోత విధించడం జరుగుతుంది. కోల్ పెన్షనర్లకు పెన్షన్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులకు దాదాపు 100 మందికి వినతి పత్రాలు ప్రధాన మంత్రి, కేంద్ర బొగ్గు శాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్ఛారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల అపరిమిత వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు ఇతర మంత్రులకు కూడా వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి ఫలితం దక్కడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీల మ్యానిఫెస్టో లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పెన్షన్ పెంపు, ఉచిత వైద్య సేవలు గురించి ప్రస్తావించి గెలిచిన పార్టీ వారు అట్టి హామీలు అమలు పరుస్తారని ఆశిస్తున్నారు.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.