ఆర్.కె న్యూస్ ,నస్పూర్: మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి రావాలని కోరుకుంటూ నస్పూర్ పట్టణంలోని ఆర్కే 5 కాలనీ బ్యారెక్స్ లో గల జామే మసీదులో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామే మస్జీద్ అధ్యక్షులు మొహమ్మద్ మౌలానా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంద్రవెల్లిలో నిర్వహించిన ఎన్నికల సమర శంఖారావ సభను విజయవంతం కావడానికి ప్రేమ్ సాగర్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు కృషి ఫలితంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తమకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు గెలుపుకు తమ వంతు కృషి చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు ముస్లిం సోదరులతో పాటు హిందూ, క్రైస్తవులతో పాటు అనేక వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారన్నారు. ఈ హామీలన్నీ అమలు కావాలన్నా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి ఇవ్వాలని ముస్లిం సోదరులందరూ ఆశిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టిన గత 10 సంవత్సరాల నుండి మంచిర్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో నీటి ఎద్దడి తీర్చడానికి ప్రత్యేక ట్యాంకర్లు పెట్టి నీరు ఇచ్చిన ఘనత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కే దక్కుతుందన్నారు. రంజాన్ మాసం, దసరా పండుగ వచ్చిందంటే కొక్కిరాల సురేఖమ్మ ఆడపడుచులకు ఇచ్చిన చీరలు మరిచిపోనివని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఎదుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జామే మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
197