- మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా జిల్లాలో వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా గ్రీన్ కోర్ సమన్వయకర్త గుండేటి యోగేశ్వర్ తో కలిసి జాతర సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, వేడుకలకు హాజరయ్యే భక్తులు సహకరించాలని, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగనున్న జాతరలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నియంత్రించి కాలుష్య రహితంగా జాతర జరుపుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, రవాణా సౌకర్యం, త్రాగునీరు తదితర అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని, వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జాతరకు వెళ్లే వారు విధిగా పర్యావరణ మిత్ర బట్ట సంచులను తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.