దేశవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది బొగ్గు పెన్షన్ దారులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం కనీస పెన్షన్ రూ.350 నిర్ణయించబడింది. ఇరవై 24 నుంచి జాతీయ కార్మిక సంఘాలు, బొగ్గు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘాల ఆందోళనల ఫలితంగా కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి ట్రస్ట్ బోర్డ్ ప్రతిపాదన మేరకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేటి కాలంలో వెయ్యి రూపాయలతో పెన్షన్దారుల కనీస అవసరాలు తీరేనా? ఇట్టి పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే వృధ్యాప్య పెన్షన్ రెండు వేల రూపాయల కన్నా తక్కువ ఉండటం విస్మయం కలిగిస్తోంది. బొగ్గు గనుల్లో పని చేసే వారికి శ్రమ అధికం. గనులలో అధిక వేడి, వెలుతురు, గాలి ఉండక పోవడం తో చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ ఉంటారు. పదవీ విరమణ తరువాత గుండె జబ్బులు, రక్త పోటు, మూత్రపిండాల వ్యాధులతో మరింతగా మంచాన పడుతున్నారు. బొగ్గు గని కార్మికులు దేశానికి వెలుగు నిచ్చే కాగడాలు, అంతే కాని సేవా రంగంలో పని చేసే ఉద్యోగులు కారు. ప్రభుత్వ ఉద్యోగులకు వారు పని చేసే కాలంలోని జీతం కంటే ప్రస్తుతం పెన్షన్ సొమ్ము ఎక్కువగా ఉంది. బొగ్గు కార్మికులు ఏ పాపం చేశారు? వారికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే పెన్షన్ తక్కువ రావడానికి కారణం ప్రభుత్వాలు వారి సేవలను గుర్తించుట లేదు. బొగ్గు కార్మికులను యాజమాన్యాలు యంత్రాలను చూసినట్లుగా కాలం చెల్లిన యంత్రాలను మూలకు వేసినట్లుగా పని దిగి పోయిన కార్మికుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ వహించుట లేదు. బీద వర్గాలకు జారీ చేసే తెల్ల కార్డులకు కూడా అర్హత లేకుండా జీవిస్తున్నారు. ఈ వేయి రూపాయలతో వారి బాధలు తీరవు. గత 24 సంవత్సరాల నుంచి కరువుభత్యంతో కూడిన కనీస పెన్షన్ 10 వేళా రూపాయలు చెల్లించాలని ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులకు, అధికారులకు విన్నవించుకున్నారు. పెన్షన్ ఫండ్ లో కొరత ఉందని, రోజు రోజుకు పెన్షన్ దారుల సంఖ్య పెరగడం, బొగ్గు పరిశ్రమలో నూతన నియామకాలు తగ్గడంతో పెన్షన్ ఫండ్ బలహీన పడుతుంది. గతంలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వారు 727 కోట్ల రూపాయల మోసం వలన కూడా పెన్షన్ ఫండ్ తగ్గింది. గతంలో నిర్ణయించిన టన్ను బొగ్గు కు 10 రూపాయలు పెన్షన్ ఫండ్ లో జమ చేయడం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. టన్ను బొగ్గు అమ్మకం పై 20 రూపాయలు వసూలు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. బొగ్గు యాజమాన్యాలు వారు ఆర్జిస్తున్న లాభాల నుంచి ఐదు శాతం పెన్షన్ ఫండ్ లో జమ చేయాలని, పెన్షన్ ఫండ్ బలోపేతం కొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,బొగ్గు యాజమాన్యాలు ప్రతి సంవత్సరం బొగ్గు విశ్రాంత కార్మికులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి శాశ్వత ప్రతిపాదనలు చేస్తే బొగ్గు పెన్షన్ దారుల కష్టాలు తీరుతాయి తప్ప వేయి రూపాయలతో వారి కష్టాలు తీరవు.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
ఉప ప్రధాన కార్యదర్శి, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
📱 8686051752, 📍హైదరాబాద్.