• గుర్తింపు కార్మిక సంఘం నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: కార్మికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలం అవుతుందని గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముసుకే సమ్మయ్య శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు అన్నారు. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు బుధవారం ఆర్.కె 5 గనిని సందర్శించి, వివిధ డిపార్ట్మెంట్ల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ సంస్థకు సంబంధించిన వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలోని పలు జిల్లాలకు సిఎస్ఆర్, డి.ఎం.ఎఫ్.టి నిధుల పేరుతో ధారాదత్తం చేస్తున్న యాజమాన్యం కార్మికులకు కనీసం రెస్ట్ హాల్, కబోర్డ్స్ సమకూర్చే పరిస్థితుల్లో లేదన్నారు. ఆర్.కె 5 గనిలో కార్మికుల రెస్ట్ హాల్స్ అధ్వానంగా ఉన్నాయని, వర్షం కురిస్తే రెస్ట్ హాళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. కార్మికులకు నాసిరకమైన బూట్లు, డ్రిల్ బిట్లు సరఫరా చేస్తున్నారన్నారు. గనిలో వెంటిలేషన్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, ఫిట్ సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ట్రేడ్స్ మేన్స్ నాయకులు సురేష్, నాయకులు మల్లేష్, జిపి రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.