- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోకల నాగయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఉన్న ఓటరు నమోదుకు ఉన్న అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు అధ్యాపకునిగా పని చేసిన తనకు ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలు తెలుసని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ నాయకులు, డబ్బు ఉన్న వారు పోటీ చేస్తున్నారని, పట్టభద్రుల ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ సామాన్యుడైన తనకు అవకాశం కల్పించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు వేసి భారత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని అన్నారు. కరోనా సమయంలో పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు చనిపోయిన సంబంధిత యాజమాన్యాలు పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రాజేష్ యాదవ్, టిఎల్ఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాపెల్లి రాజన్న యాదవ్, టిఎల్ఎఫ్ గోదావరిఖని పట్టణ కార్యదర్శి పాదం శ్రీను పాల్గొన్నారు.