- టాస్క మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పి. శంకర్ గౌడ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: వయో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులు కాలయాపన చేయకుండా సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టాస్క) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పి. శంకర్ గౌడ్ అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టాస్క) ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేని స్వచ్ఛంద సంస్థ అని, తల్లిదండ్రులు, వయోధికుల పోషణ సంక్షేమ చట్టం 2007 రూల్ 20 కచ్చితంగా అమలు చేయాలన్నారు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ణీత సమయంలో తీర్పును వెలువరించి అమలుపరిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సీనియర్ సిటిజన్ల కొరకు ప్రతి మండలంలో డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, ఉచిత వైద్యం అందించాలని, ఉచిత రైల్వే, బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని, వయోవృద్ధుల సంక్షేమం కొరకు బడ్జెట్ లో ఐదు శాతం నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. 2007 చట్టం సెక్షన్ 21 ప్రకారం వృద్ధులకు పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని కోరారు. వృద్ధులను గెంటివేస్తే సెక్షన్ 24 ప్రకారం విధించే శిక్ష, జరిమానాలను పెంచాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా మండలాల వారీగా టాస్క కమిటీలు వేస్తామని, టాస్క బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాస్క జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కనకయ్య, కలవేని సమ్మయ్య, కే. నరసింహారెడ్డి, గండ్ర రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- టాస్క జిల్లా ఉపాధ్యక్షుడిగా చిలువేరు సదానందం
తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టాస్క) మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా నస్పూర్ పట్టణానికి చెందిన చిలువేరు సదానందం నియమితులయ్యారు. ఆదివారం ఈ మేరకు టాస్క మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పి. శంకర్ గౌడ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిలువేరు సదానంద మాట్లాడుతూ, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి, టాస్క బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.