60
- జులై నెలలో నూరు శాతం ఉత్పత్తి సాధించడం అభినందనీయం
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
- ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి వ్యాప్తంగా ఆర్.కె 5 గనికి ప్రత్యేక గుర్తింపు ఉందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆర్.కె 5 గని పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఉత్పత్తి, రక్షణలోనే కాదు స్వచ పక్వాడ్, పర్యావరణ పరిరక్షణ ఇతర సామాజిక కార్యక్రమాల్లో ఆర్.కె 5 ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. తక్కువ ఎత్తు పని ప్రదేశాలలో సైతం నిబద్ధతతో కృషి చేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా జులై నెలలో ఆర్.కె 5 గని 100 శాతం ఉత్పత్తి సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో రక్షణతో ఈ సంవత్సరం నూరు శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు. టార్గెట్ సాధించటంలో ముఖ్య పాత్ర పోషించిన ఏజెంట్, మేనేజర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 6 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి సాధించి భూగర్భ గనుల్లో రికార్డ్ సృష్టించిన ఘనత ఆర్.కె 5 గనికి ఉందన్నారు. ఉద్యోగులకు అవసరమైన అన్ని వసతులు, పని ప్రదేశాల్లో మెటీరియల్స్ ఏర్పాటు చేస్తామని, జులై మాసం తరహాలోనే రానున్న రోజుల్లో రక్షణతో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా 100 శాతం ఉత్పత్తి సాధించాలని కోరారు. జులై నెలలో అధిక ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన రిలే ఏ ఉద్యోగులను ప్రోత్సాహక బహుమతులతో అభినందించారు. అనంతరం గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బాగుంటేనే ఉద్యోగులకు మంచిదని, యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు, యూనియన్లు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, గ్రూప్ ఇంజనీర్ శ్రీనివాస భట్టాచార్య, రక్షణ అధికారి శివయ్య, సంక్షేమ అధికారి హరికృష్ణ, పిట్ ఇంజనీర్ శ్యామ్, అసిస్టెంట్ మేనేజర్ లు రాందాస్, వినయ్ రెడ్డి, పిట్ సెక్రటరీ నర్సింగ రావు, అండర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, మైనింగ్ స్టాప్, వివిధ యూనియన్ల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.