25
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
- నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఓట్లు లెక్కించిన సీఐటీయూ నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు తమకు అండగా ఉంటే సొంతింటి కల నెరవేరుస్తామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, కార్మికుల సొంతింటి కల సాకారం కోసం గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని, ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధపడినట్లు, సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సాకారం కావడానికి కార్మికుల ఐక్యత ముఖ్యమని, కార్మికులు అండగా ఉంటే సొంతింటి కల నెరవేర్చుకోవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పలువురు రాజకీయ నాయకులు మేనిఫెస్టోలో సొంతింటి పథకాన్ని చేర్చారని, ఎన్నికల అనంతరం విస్మరించారని, సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని ఏరియాల జీఎంలకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. కార్మికులను ఏకం చేయడానికి ఈనెల 11, 12 తేదీల్లో ఓటింగ్ ద్వారా అభిప్రాయం తెలపాలని బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయగా యూనియన్లకు అతీతంగా కార్మికులు తమ అభిప్రాయాలు తెలిపారని చెప్పారు. ప్రెస్ క్లబ్ లో బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్లు లెక్కించగా 4543 మంది కార్మికులు సొంతిల్లు కావాలని, 31 మంది కార్మికులు సింగరేణి క్వాటర్ కావాలని ఆకాంక్షినట్లు తెలిపారు. వర్షం కారణంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయని, కొన్ని కార్మిక సంఘాలు ఆటంకాలు కలిగించడంతో గనులకు దూరంగా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, కార్మికులు ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో సొంతిల్లు సాధించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ గుల్ల బాలాజీ, బ్రాంచ్ నాయకులు వెంగళ శ్రీనివాస్, తోడే సుధాకర్, పెరుక సదానందం, శ్రీధర్, సాయిల్ల శ్రీనివాస్, ఇత్తినేని వెంకటేష్, కేసిపెద్ది శ్రీనివాస్, కిషన్ రెడ్డి, శ్రీపతి బానేష్, నవీన్, వెంకట్ రెడ్డి, డివైఎఫ్ఐ నాయకులు మిడివెల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.