ఏఐటీయూసీ నాయకులు కందికట్ల వీరభద్రయ్య, ఎస్ కె బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో రక్షణ చర్యలు కరువయ్యాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రెటరీ ఎస్.కె బాజీ సైదా ఆరోపించారు. గురువారం వారు ఆర్.కె 7 గనిని సందర్శించి, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గనిలో రక్షణ అధికారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ప్రమాదంలో ఎస్‌డిఎల్ బండి కేబుల్ తాకి శ్రీనివాస్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఒకే లెవల్‌లో రెండు ఎస్‌డిఎల్ యంత్రాలు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇది పూర్తిగా యాజమాన్య వైఫల్యమని మండిపడ్డారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి, గనిలో రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ అవసరాల నిమిత్తం అండర్ గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్‌పై విధుల్లో వాడుకుంటూ, ఇప్పుడు వారి అండర్ గ్రౌండ్ అలవెన్సులను రికవరీ చేయడం దారుణమని అన్నారు. కార్మికుల వేతనాల నుంచి చేస్తున్న రికవరీలు వెంటనే ఆపాలని, లేనిపక్షంలో యాజమాన్యంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, ఏరియా సెక్రటరీ సంపత్, పిట్ సెక్రటరీ మారేపల్లి సారయ్య, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సదానందం, నాయకులు శంకర్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





