33
రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం
శ్రీరాంపూర్ ‘చాయ్ పే చర్చ’లో బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరెడ్లశ్రీనివాస్
నస్పూర్ , ఆర్.కె న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా బీసీలు తమ సత్తా చాటాలని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం మైదానంలో నిర్వహించిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, రాష్ట్రవ్యాప్తంగా 17 శాతం, మంచిర్యాల జిల్లాలో కేవలం 7 శాతం మాత్రమే ఇవ్వడాన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జిల్లాలో మొత్తం 306 పంచాయతీలకు గాను కేవలం 23 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించడం, గ్రామస్థాయిలో బీసీలను రాజకీయంగా అణచివేయడమేనని మండిపడ్డారు. జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు చట్టబద్ధత ఉంటుందని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రభుత్వాలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. బీసీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. “మన ఓటు మనకే” అనే నినాదంతో, అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడానికి కంకణబద్ధులై పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, బీసీ సమాజ్ జిల్లా నాయకులు వేముల కిరణ్, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రయ్య, బీసీ సమాజ్ నాయకులు ఆడెపు సురేష్, తాటిపాముల సమ్మయ్య, ఎనగందుల వెంకటేష్, గాజుల సంపత్, చల్ల శ్రీనివాస్, వెయ్యికండ్ల శ్రీకాంత్, సూర్య కిరణ్, గుజ్జేటి నరేష్, పూదరి కృష్ణ, పొట్లబత్తిని రాజేష్ తదితరులు పాల్గొన్నారు.





