25
ఘనంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: దివ్యాంగ పిల్లల్లో ధైర్యాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ, వారి ఉన్నతికి సింగరేణి సంస్థ తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియా ‘వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సీఈఆర్ క్లబ్లో ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జీఎం మునిగంటి శ్రీనివాస్, క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని కొనియాడారు. ప్రతి విద్యార్థిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని, దానిని వెలికి తీయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజంలో దివ్యాంగ పిల్లలు తమ సామర్థ్యాలను నిరూపించుకునేలా వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి వారిని ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో రన్నింగ్ రేస్, త్రో బాల్ వంటి వివిధ విభాగాలలో పోటీలను నిర్వహించారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, స్పోర్ట్స్ చీఫ్ కోఆర్డినేటర్, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, స్పోర్ట్స్ హననరీ సెక్రటరీ పాల్ సృజన్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నరసయ్య, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.





