వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
సిసిసి నస్పూర్ ఎస్ హెచ్ ఓ యు. ఉపేందర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయి వాహన తనిఖీలు చేపట్టారు. స్థానిక సిసిసి కార్నర్ వద్ద ఎస్ హెచ్ఓ యు. ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ఉపేందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమానాస్పదంగా తిరిగే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డుపైకి వాహనం తీసుకొచ్చే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి అన్ని రకాల ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. తనిఖీల సమయంలో పత్రాలు చూపించడంలో విఫలమైతే జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఏఎస్ఐలు బషీర్, శకుంతల, పోలీసు సిబ్బంది గోపాల్, వనిత, ఉష, శ్వేత తదితరులు పాల్గొన్నారు.





