రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ఘనంగా 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకలు
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు
రామగుండం, ఆర్.కె న్యూస్: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పనితీరు, వారి త్యాగాలు మరువలేనివని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో ’63వ హోంగార్డు రైసింగ్ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ అంబర్ కిషోర్ ఝా, హోంగార్డుల పరేడ్ ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ కమాండర్ గా హోంగార్డ్ ఆర్.ఐ. పెద్దన్న వ్యవహరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు నిర్వహణ వంటి క్లిష్టమైన సమయాల్లో హోంగార్డులు చూపుతున్న అంకితభావం అభినందనీయమని అన్నారు. వారి క్రమశిక్షణ పోలీస్ శాఖకు గర్వకారణమని కొనియాడారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. వేడుకల్లో భాగంగా కమిషనరేట్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి సీపీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్.ఐ.లు దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సంపత్, ఇతర ఆర్.ఎస్.ఐలు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





