లాభాల్లో వాటా లేదు.. వైద్యంలో తీవ్ర వివక్ష
ఉరికొయ్యలపై విశ్రాంత కార్మికులు
ఐఎన్టీయూసీ జాతీయ నేత జెట్టి శంకర్ రావు
పెన్షన్ పెంపు, అపరిమిత వైద్యం కోసం ఐఎన్టీయూసీ డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్రానికే మణిహారమైన సింగరేణి సంస్థను తమ స్వేదంతో నిర్మించి, నష్టాల నుంచి లాభాల దిశగా నడిపించిన కార్మికులు నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని, సంస్థ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన వారు, విశ్రాంత జీవితంలో కనీస వైద్యానికి నోచుకోక, పెన్షన్ చాలక ఉరికొయ్యలపై వేలాడుతున్నారని ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత కార్మికుల సమస్యలపై ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “వన్ ఫ్యామిలీ – వన్ విజన్ – వన్ మిషన్” అని ప్రకటిస్తున్న యాజమాన్యం, ఆ నినాదంలో విశ్రాంత కార్మికులకు చోటు లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. గతంలో 10 శాతంగా ఉన్న సింగరేణి లాభాలు ప్రస్తుతం 34 శాతానికి పెరిగాయని, ఈ వృద్ధిలో కార్మికుల పాత్రే కీలకమని శంకర్ రావు గుర్తు చేశారు. అయితే, పెరిగిన లాభాల్లో విశ్రాంత కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు ‘శూన్యం’గా ఉండటం బాధాకరమన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెరగడం లేదని, పెండింగ్ కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతున్నాయని వాపోయారు. సంస్థలో అధికారులు, కార్మికుల మధ్య ఉన్న వైద్య సదుపాయాల అంతరాన్ని ఆయన ఎండగట్టారు. అధికారులకు రూ. 25 లక్షల వైద్య పరిమితితో పాటు ఏటా రూ. 36,000 వైద్య భత్యం ఇస్తున్నారని, కానీ కార్మికులకు మాత్రం కేవలం రూ. 8 లక్షల పరిమితి విధిస్తూ, వైద్య భత్యం నిరాకరించడం దారుణమని మండిపడ్డారు. “ప్రాణానికి కూడా హోదా ప్రమాణాలు పెట్టడం న్యాయమా?” అని ఆయన యాజమాన్యాన్ని ప్రశ్నించారు. గ్రాట్యూటీ అమలు తేదీల విషయంలోనూ కార్మికులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2016 నుండి, సింగరేణి అధికారులకు 2017 నుండి గ్రాట్యూటీ పెంపు అమలు చేయగా.. కార్మికులకు మాత్రం 2018 నుండి అమలు చేసి తీవ్ర ఆర్థిక నష్టానికి గురిచేశారని విమర్శించారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ సమీక్ష తప్పనిసరిగా జరపాలని, మెడికల్ కార్డు పరిమితితో సంబంధం లేకుండా కార్మికులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి ఉచిత అపరిమిత వైద్యం అందించాలని, గ్రాట్యూటీ పెంపును 2016 నుంచే కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. విషవాయువులు, దుమ్ము, ధ్వని కాలుష్యం, గని ప్రమాదాల మధ్య నిత్యం పోరాటం చేసే బొగ్గుగని కార్మికుడు యుద్ధ సైనికుడితో సమానమని పేర్కొన్నారు. బి. జనక్ ప్రసాద్ సారధ్యంలో హైదరాబాద్‌లో సింగరేణి కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు ద్వారా మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, అయితే తక్షణ ఉపశమనంగా కరువు భత్యం లేని రిటైర్డ్ ఉద్యోగులకు అపరిమిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.





