శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
ఆర్.కె 7 గనిలో ఘనంగా 56వ రక్షణ పక్షోత్సవాలు ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: రక్షణతో కూడిన ఉత్పత్తే సింగరేణి సంస్థ ధ్యేయమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్.కె 7 గనిలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలను ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్, కార్పొరేట్ జీఎం (ఎన్విరాన్మెంట్) బి. సైదులుతో కలిసి ప్రారంభించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంస్థ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దిశగా సాగుతున్న తరుణంలో, కార్మికుల రక్షణే పరమావధిగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి రక్షణ పరికరాలు ధరించి, నిబంధనలు పాటిస్తూ ఉత్పత్తిలో భాగస్వాములు కావాలన్నారు. పక్షోత్సవాల్లో భాగంగా సేఫ్టీ టీమ్స్ ప్రతిరోజూ గనిలో తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్, కార్పొరేట్ జీఎం బి. సైదులు మాట్లాడుతూ.. ఆర్.కే-7 గని గతంలో రక్షణ, స్టవింగ్ విభాగాల్లో అవార్డులు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. రక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలని హితవు పలికారు. గనిలో మహిళా అధికారులు విధులు నిర్వర్తించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, గని ఏజెంట్ కుర్మ రాజేందర్, మేనేజర్ జె. తిరుపతి, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య, వైస్ ప్రెసిడెంట్ కిషన్ రావు, గని రక్షణాధికారి సంతోష్ రావు, గని సంక్షేమాధికారి సంతన్, పిట్ కార్యదర్శి సారయ్య, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.





