రక్షణ చర్యల్లో రాజీ పడకూడదు
కార్పొరేట్ సేఫ్టీ జీఎం కె. సాయిబాబు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో ‘శూన్య ప్రమాదాల’ ను లక్ష్యంగా పెట్టుకొని ప్రతి విభాగం పనిచేయాలని, రక్షణ చర్యల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని కార్పొరేట్ సేఫ్టీ జనరల్ మేనేజర్ కె. సాయిబాబు అధికారులకు సూచించారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌తో కలిసి ఆయన ఆర్.కె-5 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా గని కార్యకలాపాలను సమీక్షించి, గని ప్లాన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సీమ్‌లలో అమలు చేస్తున్న రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు మరియు సాంకేతిక పరికరాల వినియోగంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సేఫ్టీ జీఎం కె. సాయిబాబు మాట్లాడుతూ.. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. సేఫ్టీ డ్రిల్స్, మాక్ డ్రిల్స్, గ్యాస్ మానిటరింగ్, హజార్డ్ ఐడెంటిఫికేషన్, రూట్ కాజ్ అనాలిసిస్ వంటి పద్ధతులను క్రమం తప్పకుండా పాటించాలన్నారు. వెంటిలేషన్, సపోర్ట్ సిస్టమ్స్, డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్ వంటి కీలక అంశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి నివారించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. సురక్షితమైన పని వాతావరణం అనేది ఉద్యోగుల నిబద్ధత, పర్యవేక్షణాధికారుల నిరంతర పరిశీలన వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.
లక్ష్యం దిశగా ఆర్.కె-5
శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్.కె-5 గనిలో రక్షణ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగులందరూ రక్షణ పరికరాలు ధరిస్తూ ఉత్పత్తిలో భాగస్వాములవుతున్నారని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 2,70,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ శ్రీధర్, గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, గని రక్షణాధికారి శివయ్య, గని సర్వే అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.





