డిపాజిట్లపై అధిక వడ్డీ, బీమా సేవలు వినియోగించుకోవాలి
రీజినల్ మేనేజర్ బాలచంద్ర పట్కి
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సీతారాంపల్లి శాఖ 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం శాఖా కార్యాలయంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల రీజినల్ మేనేజర్ బాలచంద్ర పట్కి మాట్లాడుతూ.. సీతారాంపల్లి శాఖ 41 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెల్లా టిజిబిలోనే ప్రస్తుతం డిపాజిట్లపై అత్యధిక వడ్డీ లభిస్తోందన్నారు. ఖాతాదారులు వ్యవసాయ, గృహ, బంగారు రుణాలతో పాటు, బ్యాంకు అందించే ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి ఆపద సమయంలో అండగా నిలుస్తున్నామని, ఇటీవల ఒక బాధిత కుటుంబానికి రూ. 10.27 లక్షల క్లెయిమ్, మరొకరికి హెల్త్ ఇన్సూరెన్స్ పరిహారం అందజేశామని గుర్తుచేశారు. శాఖా మేనేజర్ నరసింహ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి నాగరాజు, సిబ్బంది, పలువురు ఖాతాదారులు పాల్గొని, శాఖ సేవలను కొనియాడారు.





