మాతృ విభాగానికి వెళ్లిన ఎన్. బలరామ్
నూతన సీఎండీకి ఘన స్వాగతం
నస్పూర్ , ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి దేవరకొండ కృష్ణ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సింగరేణి సీఎండీ (ఎఫ్.ఏ.సి – పూర్తి అదనపు బాధ్యతలు) గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సీఎండీగా విధులు నిర్వర్తించిన ఎన్. బలరామ్ తన ఏడు సంవత్సరాల డెప్యుటేషన్ కాలం ముగియడంతో మాతృ విభాగానికి తిరిగి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఎన్. బలరామ్ నుండి కృష్ణ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సంస్థ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు నూతన సీఎండీకి పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. కృష్ణ భాస్కర్ 2012 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీగా, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బహుళ బాధ్యతలతో పాటు ఇప్పుడు సింగరేణి పగ్గాలు కూడా చేపట్టారు.





