శ్రీరాంపూర్ ఉపరితల గనిలో 56వ రక్షణ పక్షోత్సవాలు
హాజరైన ఉన్నతాధికారులు
నస్పూర్ , ఆర్.కె న్యూస్: రక్షణ ప్రమాణాలను పాటిస్తూ అధిక ఉత్పత్తిని సాధించడం సంస్థకు గర్వకారణమని, రక్షణతో కూడిన ఉత్పాదకతే సంస్థ ప్రధాన లక్ష్యమని సింగరేణి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని శ్రీరాంపూర్ ఉపరితల గనిలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రక్షణ వారోత్సవాల తనిఖీ కమిటీ కన్వీనర్, జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డి) చిట్టా వెంకటరమణ, జనరల్ మేనేజర్ (సేఫ్టీ, బెల్లంపల్లి రీజియన్) రఘు కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరాంపూర్ ఏరియా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో సుమారు 54 శాతం వాటా ఉపరితల గనిదేనని ప్రశంసించారు. భవిష్యత్తులో చిన్న ప్రమాదం కూడా జరగకుండా ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులకు హాజరయ్యే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మస్టర్ సమయానికి ముందే గనిని చేరుకొని పనిని ఆరంభించాలని సూచించారు. ముఖ్యంగా షావల్స్, డంపర్ల వంటి భారీ యంత్రాలు నడిపే సమయంలో ఎస్.ఓ.పి ప్రకారం రక్షణ పద్ధతులను కఠినంగా పాటించాలని, పనిలో తొందరపాటు వద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు ప్రదర్శించిన సి.పి.ఆర్ విధానం, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, గని ప్రాజెక్ట్ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు, గని మేనేజర్ ఇందూరి శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, గని రక్షణాధికారి శ్రీధర్, సంక్షేమ అధికారి ఓంకార్ బాబు, పిట్ కార్యదర్శి లచ్చన్న, రక్షణ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





