గతంలో రూ. 3.30 లక్షలు.. ఇప్పుడు కేవలం రూ. 60 వేలేనా?
యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా జరుపుకునే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ నిధులను యాజమాన్యం భారీగా తగ్గించడాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే. బాజీ సైదా, ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరు కొమురయ్య గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రకృతితో పోరాడి బొగ్గు ఉత్పత్తి చేస్తూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏటా సింగరేణి దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ డివిజన్‌కు గతంలో రూ. 3,30,000 నిధులు కేటాయించేవారని, ఆ నిధులతో ముగ్గుల పోటీలు, క్రీడలు, వెల్ బేబీ షో వంటి కార్యక్రమాలు నిర్వహించి కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నింపేవారని గుర్తు చేశారు. కానీ, ఈ ఏడాది ఆ నిధులను ఏకంగా 25 శాతానికి తగ్గించి, కేవలం రూ. 60,000 మాత్రమే మంజూరు చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. సంస్థకు సంబంధం లేని ఇతర జిల్లాలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్న యాజమాన్యం, కార్మికుల ఆనందం కోసం నిర్వహించే వేడుకల నిధుల్లో కోత విధించడం సరికాదని వారు ధ్వజమెత్తారు. యాజమాన్యం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల కార్మిక కుటుంబాలు ఉత్సవాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యం స్పందించి, గతంలో ఇచ్చిన నిధుల కంటే అదనపు నిధులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆనందోత్సవాల మధ్య సింగరేణి దినోత్సవాన్ని జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.





