ఏఐతో ఫోటో సృష్టించిన నిందితుడిపై కేసు నమోదు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసిసి టౌన్ షిప్ పరిధిలో బుధవారం రాత్రి పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌ఓ) శివ్ ఆశిష్ సింగ్ స్పష్టం చేశారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో ఒక వ్యక్తి పులి ఫోటోను సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన తెలిపారు. పులి వార్తలతో ప్రజలు ఆందోళన చెందడంతో డిఎఫ్‌ఓ శివ్ ఆశిష్ సింగ్, రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ ఆధ్వర్యంలో పది బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, ఎక్కడా పులి జాడ గానీ, పాదముద్రలు గానీ లభించలేదు. దీంతో అది తప్పుడు ఫోటో అని అధికారులు ధ్రువీకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుడు ఫోటో సృష్టించిన వ్యక్తిని గుర్తించిన అధికారులు, అతడిని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి అది ఫేక్ అని ఒప్పించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన సదరు వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వదంతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే 9440313191, 9441533220 నెంబర్లకు తెలపాలని అధికారులు కోరారు.





