రిటైర్డ్ కార్మికులకు బోనస్ నిలిపివేయడం దుర్మార్గం
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో కొంతమంది అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తూ సంస్థ కీర్తిప్రతిష్టలను దెబ్బతీస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. పదవీ విరమణ చేసిన కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్ (పీఎల్ఆర్) చెల్లించడానికి క్వార్టర్ ఖాళీ చేయాలనే నిబంధన పెట్టడం గతంలో ఎన్నడూ లేదని ఆయన గుర్తుచేశారు. గతంలో క్వార్టర్ ఖాళీ చేయని పక్షంలో కేవలం గ్రాట్యూటీ మాత్రమే నిలిపివేసేవారని, ఇప్పుడు బోనస్‌లను కూడా ఆపడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారుల ఈ కొత్త నిబంధనలు రిటైర్డ్ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలను రాబట్టడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని సీతారామయ్య విమర్శించారు. ఒకవైపు సంస్థకు రావాల్సిన నిధులపై నిర్లక్ష్యం వహిస్తూనే, మరోవైపు సింగరేణి కార్యకలాపాలు లేని జిల్లాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సింగరేణి నిధులు ధారాళంగా ఇస్తున్నప్పుడు, కార్మికుల హక్కుల విషయంలో ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు.
అవతరణ వేడుకలపై వివక్ష
సింగరేణి అవతరణ దినోత్సవం అనేది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు జరుపుకునే గొప్ప పండుగని, అయితే ఈ ఏడాది నిధులు లేవనే సాకుతో వేడుకలను కేవలం జనరల్ మేనేజర్ కార్యాలయాలకే పరిమితం చేయడం అన్యాయమన్నారు. బడ్జెట్ తగ్గించి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, సంస్థ భవిష్యత్తును నిర్వీర్యం చేయడానికి పూనుకున్న అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఏఐటీయూసీ తరపున తీవ్రంగా ప్రతిఘటిస్తామని సీతారామయ్య స్పష్టం చేశారు.





