- సింగరేణిలో ‘ప్రీ-హైరింగ్ అప్లికేషన్’పై జీఎం జీవీ కిరణ్ కుమార్ సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో కారుణ్య మరియు ఆధారిత నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు డిజిటల్ విధానాన్ని పటిష్టం చేస్తున్నట్లు జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్ జీవీ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ఏరియాల పర్సనల్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ-కోడ్ వై ఎంప్లాయ్ అనే ప్రీ-హైరింగ్ అప్లికేషన్ ద్వారా కారుణ్య నియామక కేసులను డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. యూనిట్ స్థాయిలో దరఖాస్తులను స్వీకరించడం మొదలుకొని, శాప్ హెచ్ ఆర్ బృందం ద్వారా తుది నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దీనివల్ల డేటా నమోదు, ధృవీకరణ, సీనియారిటీ జాబితా తయారీ, పోస్టింగ్ మరియు ఆన్-బోర్డింగ్ వంటి అన్ని దశల్లో జాప్యం లేకుండా పారదర్శకత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త డిజిటల్ విధానంలో మాజీ ఉద్యోగి వివరాల నమోదు, ధృవీకరణ, వైద్య పరీక్షలు (ఐఎంఈ), పుట్టిన తేదీ నిర్ధారణ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం సీనియారిటీ జాబితాను రూపొందించి, పోస్టింగ్ వివరాలు మరియు జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారని వివరించారు. మానవ వనరుల విభాగం తుది సమీక్ష నిర్వహించిన తర్వాతే నియామక ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డిప్యూటీ పీఎం జీకే కిరణ్ కుమార్, అన్ని గనుల సంక్షేమ అధికారులు మరియు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.





