వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలకు దక్కిన అరుదైన గుర్తింపు
హైదరాబాద్‌లో ఘనంగా సత్కారం
నస్పూర్, ఆర్.కె న్యూస్: అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి గాను జిల్లా వీ 107 ఏ పరిధిలో చేపట్టిన విశేష సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా రీజియన్ చైర్పర్సన్ కేశెట్టి వంశీకృష్ణకు ‘ఉత్తమ చైర్పర్సన్’ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని క్లాసిక్ 3 కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయనను ఈ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని 15 వాసవి క్లబ్‌లకు రీజియన్ చైర్‌పర్సన్‌గా వంశీకృష్ణ అద్భుతమైన సేవలు అందించారు. క్లబ్ సభ్యత్వ నమోదును భారీగా పెంచడంతో పాటు, సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు వడ్డీ లేని రుణాలు అందజేయడం, నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యార్థివేతనాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. ఉత్తమ రీజియన్ చైర్‌పర్సన్‌గా అవార్డు అందుకున్న వంశీకృష్ణను జిల్లా గవర్నర్ ఇల్లందుల కిషోర్, అంతర్జాతీయ అధికారులు ముక్త శ్రీనివాస్, శ్రీనివాస్, సిరిపురం రాజేష్, కటకం హరీష్, కొండ చంద్రశేఖర్, బాల సంతోష్, పుల్లూరి బాలు మోహన్ అభినందించారు. అలాగే తోటి జర్నలిస్టులు, ఓం అష్టోత్తర యోగా పీఠం సభ్యులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆయన చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు.





