శ్రీరాంపూర్‌లో ఘనంగా 137వ సింగరేణి ఆవిర్భావ వేడుకలు
ఉత్పత్తి లక్ష్యాల సాధనలో రక్షణను విస్మరించొద్దు
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితోనే సంస్థ పురోభివృద్ధి
ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో దేశ, రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ ఆవరణలో 137వ సింగరేణి ఆవిర్భావ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మార్కెట్లో నాణ్యమైన బొగ్గుకు మాత్రమే డిమాండ్ ఉందని, ఉద్యోగులందరూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి సాధనలో రక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని, సింగరేణిని ప్రమాద రహిత (జీరో హార్మ్) సంస్థగా తీర్చిదిద్దాలని కోరారు. గత ఏడాది సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు నాణ్యతలో అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 1500 హెక్టార్లలో ఆరు కోట్ల మొక్కలను నాటినట్లు జీఎం తెలిపారు. సింగరేణి సేవా సమితి ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో 600 మందికి పైగా మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణ అందించి, వారు స్వయం ఉపాధి పొందేలా సహకరించామని వివరించారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా సింగరేణిలో ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా గైర్హాజరు అయ్యే ఉద్యోగులు తమ హాజరు శాతాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆర్కే న్యూటెక్ గని 112 శాతం బొగ్గు ఉత్పత్తితో ముందంజలో ఉండటం అభినందనీయమని కొనియాడారు. బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రరావు మాట్లాడుతూ.. సింగరేణి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు ఉజ్వల భవిష్యత్తు వైపు సాగుతోందన్నారు.
ఆకట్టుకున్న ఎంఎస్ ఫార్ములా ప్రసంగం
ఏరియా డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్ పనిగంటల సద్వినియోగంపై ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ఆయన వివరించిన ఎంఎస్ ఫార్ములా (మదర్ సింగరేణి), అధికారులు, కార్మికుల విధులను విశ్లేషించిన తీరు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
- ఉత్తమ ఉద్యోగులకు సన్మానం..
వేడుకల్లో భాగంగా ఏరియా పరిధిలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఉద్యోగులు, అధికారులను జీఎం ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం చిన్నారులు, కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె. వెంకటేశ్వర్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ టి. రమణ రావు, ఏజీఎం (సివిల్ క్వాలిటీ) బి. నవీన్, ప్రాజెక్ట్ అధికారులు ఏ. వెంకటేశ్వర రెడ్డి, చిప్ప వెంకటేశ్వర్లు, ఏజెంట్లు కుర్మ రాజేందర్, శ్రీధర్, రవి కుమార్, డీజీఎంలు ఎస్. అనిల్ కుమార్, ఆనంద్ కుమార్, హరి నారాయణ, రాజన్న, విజయ్ కుమార్, సర్వే అధికారి నర్సింగరావు, డీవైసీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, లా అధికారి మల్లేష్, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి , ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, ఐటి ప్రోగ్రామర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.





