మహిళా కార్మికులతో బరువు పనులు చేయించడం అన్యాయం
ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఐఎన్టీయూసీ బాయి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీరాంపూర్ స్టోర్స్, టింబర్ యార్డ్ కార్మికులను యూనియన్ నాయకులు కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ స్టోర్స్ టింబర్ యార్డులో కాంట్రాక్టు గడువు ముగిసిందనే నెపంతో 24 మంది కార్మికులను విధులకు దూరం చేయడం సరికాదన్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకపోవడంతో, లారీల్లో వచ్చే భారీ యంత్రాలు, సామాగ్రిని జనరల్ అసిస్టెంట్ మహిళా కార్మికులతో అన్ లోడింగ్ చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో ఇటువంటి బరువు పనులు చేయించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తక్షణమే సదరు 24 మంది కాంట్రాక్టు కార్మికులను మరో రెండు సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. టింబర్ యార్డ్ లో పనిచేస్తున్న పీస్ రేటెడ్ కార్మికులకు పని తక్కువగా ఉండటం వల్ల వేతనాలు సరిగా అందడం లేదని కార్మికులు తమ గోడును నాయకులకు వివరించారు. శ్రీరాంపూర్ స్టోర్స్ లో ఉన్న ప్రత్యేక ఫిట్మెంట్ విధానం వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని, త్వరగా వారికి బేసిక్ పే ఫిక్సేషన్ పూర్తి చేసి న్యాయం చేయాలని కోరారు. చాలా మంది కార్మికులు పదవీ విరమణకు దగ్గరగా ఉన్నందున, వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కోరారు. త్వరలోనే ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనప్రసాద్ శ్రీరాంపూర్ స్టోర్స్ లో పర్యటించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకులు కలవేని శ్యామ్, గారిగే స్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి, తిరుపతి రాజు, లాగల శ్రీనివాస్, విష్ణు ప్రసాద్, ఫిట్ కార్యదర్శి భూక్య రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





