నలుగురు నిందితుల నుంచి ఓమ్ని వ్యాన్, బైక్, 70 కేజీల రాగి తీగ స్వాధీనం
మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాష్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్-జిల్లా దొంగల ముఠాను సీసీసీ నస్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాష్ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 27న నస్పూర్ గేట్ వద్ద గల ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ షాప్ షట్టర్ పగులగొట్టి 170 కేజీల కాపర్ వైర్ చోరీ చేసిన ఘటనపై కాంట్రాక్టర్ ఎల్పుల విజయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జల్సాలు, వ్యసనాల కోసం దొంగతనాలకు అలవాటుపడిన పాత నేరస్థులు మనుపాటి శేఖర్, మేకల లక్ష్మణ్, నూకిని ప్రశాంత్, కోట విష్ణులను గురువారం నస్పూర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 70 కేజీల కాపర్ వైర్, నేరాలకు ఉపయోగించిన ఓమ్ని వ్యాన్, పల్సర్ బైక్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు 12 చోట్ల వీరు కాపర్ వైర్ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. తక్కువ సమయంలో కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీసీఎస్ ఏసీపీ కె. రవీందర్, ఇన్‌స్పెక్టర్ టి. గోపి, మంచిర్యాల రురల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోపతి రవీందర్, ఎస్సైలు ముద్దసాని శివకేశవులు, దుర్గం లలిత, ఎం. ప్రశాంత్, జితేందర్, ఏఎస్సై ఇజాజ్, హెడ్ కానిస్టేబుళ్లు దేవేంద్రప్ప, ప్రేమ్‌సింగ్, రవి, కానిస్టేబుళ్లు భరత్, జయచంద్ర, రామేశ్వర్, సతీష్, అఫ్జల్ అలీ, వెంకటసాయి, నరేందర్‌లను ఏసీపీ రత్నపురం ప్రకాష్ అభినందించారు.







