నస్పూర్ పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
రికార్డులు, మందుల నిల్వల పరిశీలన
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, అంటువ్యాధులు ప్రబలకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వైద్య శిబిరాలు, నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. గురువారం నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, రికార్డులు, మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఈ-ఔషధి పోర్టల్లో మందుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ప్రతి ఓపీ కేసుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ వంటి అసంక్రమణ వ్యాధుల పరీక్షలు నిర్వహించి క్రమం తప్పకుండా మందులు అందజేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి వారంలో రెండు రోజులు డ్రై డే పాటించేలా చూడాలన్నారు. గర్భిణుల వివరాలను ఎంసీహెచ్ పోర్టల్లో నమోదు చేసి, సకాలంలో టీకాలు వేయించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా 108, అమ్మ ఒడి వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛభారత్లో భాగంగా పీహెచ్సీని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆహారానికి ముందు, మరుగుదొడ్డి తర్వాత సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలని, తద్వారా డయేరియా, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, నర్సింగ్ అధికారిణి కవిత, ఎంఎల్హెచ్పీలు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








