- 31వ డివిజన్ బుడగ జంగాల కాలనీలో ఇందిరాగాంధీ కుటుంబ బీమా నమోదు కేంద్రం పరిశీలన
- కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డితో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇందిరాగాంధీ కుటుంబ బీమా పథకం నమోదులో ఏ ఒక్క అర్హుడు మిగిలిపోకుండా చూడాలని మంచిర్యాల
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ఆదేశించారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ బుడగ జంగాల కాలనీలో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ కుటుంబ బీమా పథకం నమోదు కేంద్రాన్ని ఆయన సందర్శించి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డితో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆదేశాలు, సహకారం, మార్గదర్శకత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి డివిజన్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం కాలనీలో పర్యటించిన మేయర్ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, బుడగ జంగాల కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.








