నేరాలకు పాల్పడితే కఠిన చర్యలని ఏసీపీ హెచ్చరిక
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ జి. రవీందర్ శనివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత నేరస్తుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి వారి ప్రస్తుత కదలికలు, జీవనశైలిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్, సీఐ రవీందర్ మాట్లాడుతూ… పాత నేరస్తులు తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుని సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, మళ్లీ ఎలాంటి నేరపూరిత చర్యలు, క్రిమినల్ కేసుల్లో తలదూర్చినా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ తనిఖీలలో సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎండీ తాసిహీనుద్దీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








