- మున్సిపల్ కమిషనర్‌కు పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్టించాలని భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. నైజాం నిరంకుశత్వానికి, రజాకార్ల దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, తెలంగాణ మలిదశ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల నాయకుల విగ్రహాలకు అనుమతులు ఇస్తున్న అధికారులు, తెలంగాణ ఉద్యమకారుడు బాపూజీ విగ్రహ ఏర్పాటుకు గత పదేళ్లుగా నిరాకరించడంపై ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తెలంగాణ వాదులను అవమానించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అమరవీరుల, ఉద్యమకారుల విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని జిల్లా కేంద్రంలో బాపూజీ విగ్రహ స్థాపనకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించని పక్షంలో అన్ని కుల, ప్రజా సంఘాల మద్దతుతో శాంతియుతంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర, అఖిల భారత పద్మశాలి సంఘాల నాయకులు కూడా ఈ విగ్రహ స్థాపన కోసం కృషి చేయాలని వారు విన్నవించారు.








