వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్న నిరుపేద కూలీ బిడ్డను ఆదుకునేందుకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ (అక్ట్) ముందుకొచ్చింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం ఆర్‌కే 6 కొత్త గుడిసెలకు చెందిన కూలీ జాడి సుధాకర్ నాలుగు ఏళ్ల కుమార్తె తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి చికిత్సకు సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో, అంత మొత్తం భరించే స్తోమత లేక ఆ తండ్రి దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లి పాప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత తండ్రి సుధాకర్‌కు ట్రస్ట్ తరఫున 10 వేల రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబానికి అండగా నిలిచేందుకు దాతలు ఉదారంగా ముందుకు రావాలని ట్రస్ట్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డి. ప్రేమ్ కుమార్, వెంకటరామిరెడ్డి, పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.







