ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 155 వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నస్పూర్ కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో టీబీజీకేఎస్ శ్రేణులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు పెట్టెం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. గాంధీజీ చూపించిన శాంతి మార్గంలో ప్రజలందరూ ముందుకు వెళ్లాలని, భారత దేశ ప్రతిష్టను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బండి రమేష్, సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, ఆర్గనైజ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎండి లాల, గోనె స్వామి, సీనియర్ నాయకులు సాదుల భాస్కర్, గొర్ల సంతోష్, మైపాల్ రెడ్డి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణిలో ఇప్పటివరకు గెలిచిన అన్ని సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యాయని, మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలన్నారు. చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, నూతన భూగర్భ గనులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. కార్మికుల శ్రమతో సింగరేణికి లాభాలు తెచ్చారని, లాభాల నుంచి సంస్థ విస్తరణ కోసం కోట్లాది రూపాయలు కేటాయించడం సరి కాదని అన్నారు. అనంతరం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంలో చేరిన సమ్ము రాజయ్య, పెరక రామస్వామి, దేవేందర్ లకు కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్ము రాజయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు మంగళవారం నస్పూర్ పట్టణంలోని శ్రీ రెయిన్ బో స్కూల్ లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు రాధా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి సంప్రదాయ రీతిలో వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లు చెన్నూరి అమన్ ప్రసాద్, చెన్నూరి మానసలు మాట్లాడుతూ తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ పండుగ అన్నారు. అనంతరం బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం బతుకమ్మ పోటీ నిర్వహించి, విజేతకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజిని, సుధా రావు, సుధా రాణి, ఉపాధ్యాయిని బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకుని వానమాములై సత్యనారాయణచార్యులు 1984వ సంవత్సరంలో శ్రీరాంపూర్ ప్రాంతంలో స్థాపించబడిన శ్రీ భగత్ సింగ్ విద్యా మందిర్ లో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆదివారం నస్పూర్ లోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. తొలుత తమతో చదువుకొని మరణించిన స్నేహితులను గుర్తు చేసుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తదుపరి ఉపాధ్యాయులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ తమ గత జ్ఞాపకాలను, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న వ్యాపారాలను, ఉద్యోగాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వయస్సును మరచి విద్యార్థి దశలోకి వెళ్లి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. పిదప సహపంక్తి భోజనాలు చేశారు. 25 సంవత్సరాల తర్వాత కలిసి చదువుకున్న మిత్రులందరూ ఒకచోట కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మిత్రులతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తాం
- గుర్తింపు సంఘం నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థకు రావాల్సిన 33 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జెన్ కో, ట్రాన్స్ కోలకు బొగ్గు, విద్యుత్ సరఫరా చేసిందని, గత ప్రభుత్వ హయాంలో బొగ్గు అమ్మిన రూపాయలు 12 వేల కోట్లు, విద్యుత్ సరఫరా చేసిన రూపాయలు 17 వేల కోట్ల రూపాయలు సింగరేణి కి చెల్లించకుండా 29 వేల కోట్ల రూపాయల బకాయి ఉందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగువేల కోట్ల వరకు బకాయిలు పడిందని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 33 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపోతుందని, తద్వారా కార్మికులకు వేతనాల చెల్లింపు, సంస్థ విస్తరణ, అభివృద్ధి, మిషనరీ కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వమే అని చెప్పుకు తిరిగే ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి సంస్థ మనుగడకు, విస్తరణకు సింగరేణి సంస్థకు రావాల్సిన 33 వేల కోట్ల రూపాయలు బకాయిలను ప్రభుత్వం చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు అవినీతికి తావు లేకుండా కార్మికులకు రావాల్సిన ప్రమోషన్స్, బదిలీలు పారదర్శకంగా చేస్తున్నామన్నారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని, కార్మికుల్లో ఏఐటీయూసీకి ఉన్న ఆదరాభిమానాలు చూడలేక కొన్ని కార్మిక సంఘాలు వారి మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్నాయన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కొరకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సంపత్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు గజ్జి రమేష్, చంద్రశేఖర్, సిద్ధం అజయ్, తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ ఉత్పత్తి ,ఉత్పాదకతో పాటు కార్మికుల సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో ఆర్కే5 గని 89 శాతం, ఆర్కే6 గని 106 శాతం, ఆర్కే7 గని 72 శాతం, ఆర్కే న్యూటెక్ గని 101 శాతం, ఎస్సార్పీ 1 గని 68 శాతం, ఎస్సార్పీ 3,3ఏ గని 91, ఐకే1ఏ గని 68 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 84 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసి2 63 శాతం, ఐకే ఓసిపి 25 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 61 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. అధిక వర్షాల కారణంగా ఉపరితల గనుల్లో ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు తెలిపారు. ఆర్ & ఆర్ కాలనీల్లో రహదారులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుతో పాటు మొక్కలు నాటినట్లు తెలిపారు. రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ సిస్టం ద్వారా గోదావరి నుంచి ఉద్యోగుల క్వార్టర్లకు రక్షిత మంచి నీటిని అందిస్తామన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3470 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ నెలలో శ్రీరాంపూర్ లో కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీలు, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి విద్యా కోర్సుల శిక్షకులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు, ఉద్యోగులకు సీఎంపిఎఫ్ చిట్టీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఇంచార్జి డీజీఎం (పర్సనల్) రాజేశ్వర్ రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్ శ్రీ నెక్స్ట్ జెన్ స్కూల్ లో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బండారి మమత బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మానస, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు
- ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు రక్షణ నియమాలు పాటిస్తూ, నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో ఆగస్టు నెలలో ఎక్కువ టబ్బులు నింపిన ఎస్.డి.ఎల్ ఆపరేటర్లు పల్లెర్ల తిరుపతి, మారేపల్లి సారయ్యలకు ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు, గని మేనేజర్ తిరుపతి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు మాట్లాడుతూ ఆర్.కె 7 గని ఎస్.డి.ఎల్ ఆపరేటర్లు ఉత్పత్తి కోసం కృషి చేయడం అభినందనీయమని, ఉత్పత్తి సాధనలో ప్రతి ఒక్క ఉద్యోగి కృషి ఉందని అన్నారు. అనంతరం గని మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్.కె 7 గనికి ఉత్పత్తి, రక్షణలో మంచి పేరు తీసుకురావాలని, ఇందుకు ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి సంతోష్ రావు, ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, అండర్ మేనేజర్ రవీందర్, ఇంజనీర్లు ప్రవీణ్, రమేష్, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీష్, సంక్షేమ అధికారి సంతన్, గుర్తింపు సంఘం నాయకులు ఏరియా సెక్రటరీ మారేపల్లి సారయ్య, పిట్ సెక్రటరీ బేర రవీందర్, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
- నిజాయితీగల అధికారులను వేధింపులకు గురి చేయడం సరికాదు
- తమ మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్న కొన్ని కార్మిక సంఘాలు
- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా పంపిణీ చేసే హక్కు సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం ఏరియాలోని ఆర్.కె 5 గని పై నిర్వహించిన సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన హాజరై మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ, సంస్థ మనుగడ కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని అన్నారు. 1999లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన 13 రోజుల సమ్మె తర్వాత నాటి టీడీపీ ప్రభుత్వం కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తానని ఒప్పుకోవడం జరిగిందని, ఆనాడు 10 శాతంగా మొదలైన లాభాల వాటా నేటికి 33 శాతం అయిందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు వచ్చిన స్థూల లాభం ప్రకటించి కంపెనీ అభివృద్ధి, కంపెనీ విస్తరణ కోసం కొంత మొత్తాన్ని మినహాయించి మిగిలిన నికర లాభం నుంచి 33 శాతం చెల్లించడం జరిగిందని, ఈ విషయంపై అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శించడం అర్ధరాహిత్యమని, కార్మికుల్లో ఏఐటీయూసీ పై ఉన్న ఆదరణ చూడలేక వారి మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్నారని అన్నారు. రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థ నష్టపోయే ప్రమాదం ఉందని, సింగరేణిలో నిజాయితీగల అధికారులను యాజమాన్యం వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగారావు, సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, నాయకులు మల్లేష్, భోగ మధునయ్య, జిపి రావు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: గుండెపోటు నివారణ చర్యలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్.కె 8 డిస్పెన్సరీలో డివైసీఎంఓ డాక్టర్ పి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని అన్నారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవాలని, గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు తప్పనిసరిగా మందులు ప్రతిరోజు వాడుతూ ఉండాలని, సంబంధిత ఆస్పత్రిలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, వ్యాధి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాన్ని జనరల్ మేనేజర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ వేదవ్యాస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి, డాక్టర్ మనీషా, డాక్టర్ పింకీ, డిస్పెన్సరీ పిట్ కార్యదర్శి విజయలక్ష్మి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.