కోటపల్లి, ఆర్.కె న్యూస్: చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మార్చి 2న చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కోటపల్లి సీఐ ఆర్. కృష్ణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటపల్లి సీఐ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యం కోసం లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ జాడి తిరుపతి, కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, కోశాధికారి లయన్ నిమ్మల సాగర్, లయన్ దుర్గాప్రసాద్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాల 6వ డివిజన్లో నూతన గృహప్రవేశం.. పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో శనివారం లబ్ధిదారు కనకమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్ తో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా గృహం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారు కనకమ్మకు కొక్కిరాల సురేఖ, ధర్ని మధుకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేఖను ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కనకమ్మ శాలువాతో ఘనంగా సన్మానించారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించినందుకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు, సురేఖకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం కొండంత అండగా నిలుస్తోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్, 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, 3వ డివిజన్ కార్పొరేటర్ పత్తి ప్రకృతి – వెంకటేష్, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి నూకల రమేష్, వివిధ విభాగాల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
- సింగరేణి ఉన్నత పాఠశాల 48వ వార్షికోత్సవం
నస్పూర్, ఆర్.కె న్యూస్: గత 48 ఏళ్లుగా సిసిసి నస్పూర్ సింగరేణి పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థితికి చేరుకున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. సిసిసి నస్పూర్ లోని సింగరేణి ఉన్నత పాఠశాల 48వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మునిగంటి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాల కీర్తిని దశదిశలా చాటాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు. 2024-2025 విద్యాసంవత్సరంలో 540 మార్కులు సాధించిన నాహేద బేగంకు 2000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అలాగే 525 మార్కులు సాధించిన అమూల్యకు 1000 రూపాయల నగదు పురస్కారాన్ని జనరల్ మేనేజర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి బహుమతులు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం ఎన్. సత్యనారాయణ, పాఠశాల కరస్పాండెంట్ ఎం. రాజేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో మదీహా సదీమ్ ప్రథమ స్థానం
మంచిర్యాల, ఆర్. కెన్యూస్: డిసెంబర్ నెలలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐఎన్టీఎస్ఓ) పరీక్షల్లో మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అఖిల భారత స్థాయిలో 9వ తరగతి విద్యార్థిని మదీహా సదీమ్ ప్రథమ బహుమతి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రిన్సిపాల్ అయూబ్ టాపర్లను అభినందించారు. ఈ పోటీల్లో వివిధ తరగతుల విద్యార్థులు ఉన్నత స్థానాలను కైవసం చేసుకున్నారు. 7వ తరగతికి చెందిన జగదీశ్వర్, 5వ తరగతి రిషిత ద్వితీయ బహుమతులు సాధించారు. 6వ తరగతి విద్యార్థిని రాంటెంకి సహస్ర, 3వ తరగతి సుహాన్ అనురాగ్ తృతీయ బహుమతులు పొందారు. 8వ తరగతికి చెందిన వొల్లాల శ్రీ హర్ష, 4వ తరగతి ప్రణవ్ నాలుగో బహుమతి గెలుచుకున్నారు. 5వ తరగతి శ్రీనిత్య, 7వ తరగతి అక్షిత ఐదో బహుమతిని అందుకున్నారు. జాతీయ స్థాయిలో పాఠశాల పేరు నిలబెట్టిన విద్యార్థులను చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవింద్‌రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జయరాజ్, మంచిర్యాల సమన్వయకర్త నాగరాజు, జయశ్రీ, డీన్ శ్యామ్, ప్రాథమిక ఇంచార్జి అనగమాత విద్యార్థులను అభినందించిన వారిలో ఉన్నారు.
పీఎంకేవీవై 4.0 కింద మూడు కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 పథకం కింద మూడు రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ టి. సుజాత తెలిపారు. 3డి ప్రింటింగ్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, సీఎన్సీ ప్రోగ్రామర్ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 4 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ శిక్షణ కాలపరిమితి మూడు నెలలు ఉంటుందని ప్రిన్సిపాల్ వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఐటీఐలో సమర్పించాలని సూచించారు. శిక్షణ సమయంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9704456295 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ధర్ని మధుకర్, సల్ల రమ్య బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో (కలెక్టరేట్) కలెక్టర్ ఛాంబర్‌కు వెళ్లిన వారు, ఆయనకు మొక్కలను అందజేశారు.
భీమారం పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
భీమారం, ఆర్.కె న్యూస్: పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకూడదని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పీఎం శ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణుడు గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమారం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నో పరీక్షలు రాసిన అనుభవంతో పదో తరగతిని అవలీలగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల్లో విజయం సాధించడానికి పాటించాల్సిన సూత్రాలు, బలాలు, బలహీనతలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పరీక్షల సమయంలో అనుసరించాల్సిన చదువు పద్ధతులు, జ్ఞాపకశక్తిని పెంచుకునే చిట్కాలను విద్యార్థులకు వివరించారు. పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రముఖుల జీవన గాథలను వివరిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి, పరీక్షలను నిర్భయంగా ఎదుర్కొంటామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సమన్వయకర్త తిరుపతి, ఉపాధ్యాయులు షారీక్, మారయ్య, సలీం, శ్రీదేవి, గోవర్ధన చారి, ఐటీ నిష్ణాతులు శరత్ చంద్ర, రాజశేఖర్ పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి.. రేపు నగరంలో స్పెషల్ డ్రైవ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ అభివృద్దే మన ప్రధాన ధ్యేయమని మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని 10, 30, 32వ డివిజన్లలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, రహదారుల నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ అన్వేష్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర సుందరీకరణ, ప్రజల సౌకర్యార్థం చేపట్టే పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా డివిజన్ల వారీగా పారిశుద్ధ్య పరిస్థితులను మేయర్ సమీక్షించారు. డ్రైనేజీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గురువారం నగరం అంతటా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి మురుగు కాల్వలను శుభ్రం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారుల నిర్మాణ పనుల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలక వర్గం పనిచేస్తుందని వెల్లడించారు. ప్రజల నుంచి అందిన వినతులపై సానుకూలంగా స్పందించిన మేయర్, క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, 30వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, నగర పాలక సిబ్బంది, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడికి ఆపరేటర్ల విజ్ఞప్తి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించేందుకు టీఎన్జీవో కేంద్ర సంఘం ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి భరోసా ఇచ్చారు. రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతూ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ నేతృత్వంలో శుక్రవారం మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లు గత 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.
ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో తాము నిరంతరం శ్రమిస్తున్నామని ఆపరేటర్లు తెలిపారు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల విధుల్లో చురుగ్గా పాల్గొన్నట్లు గుర్తు చేశారు. 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన (ఎల్‌ఆర్‌యూపీ) అమల్లోనూ తమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. యవ్వన జీవితమంతా రెవెన్యూ శాఖకే అంకితం చేశామని ఇప్పుడు ఇతర ఉద్యోగాలకు వెళ్లే వయస్సు, అవకాశం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆపరేటర్ల విజ్ఞప్తిపై స్పందించిన శ్రీహరి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి టీఎన్జీవో సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ నేతృత్వంలో ముఖ్యమంత్రిని అలాగే రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి ఆపరేటర్లకు న్యాయం జరిగేలా చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. తమ సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అనిత, రవి, షారూక్ పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి
మంచిర్యాల ఆర్.కె న్యూస్: మంచిర్యాల టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లను శుక్రవారం ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి నేతృత్వంలో ప్రతినిధుల బృందం కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, సుదమల్ల హరికృష్ణలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి నిరంతరం సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా శ్రీహరి కోరారు. శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్లు ఈ సందర్భంగా ప్రకటించారు. నగర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తామని భరోసా ఇచ్చారు. తమకు సన్మానం చేసినందుకు టీఎన్జీవో జిల్లా శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, నరేందర్, శ్రీధర్ రాజుతదితరులు పాల్గొన్నారు.



