ఆర్.కె న్యూస్, నస్పూర్
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసంలో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వి. పురుషోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
ఆర్.కె న్యూస్, నస్పూర్
ఈనెల 23న శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించనున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ పై ఏరియా ఎస్వోటు జీఎం రఘు కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్వోటు జీఎం మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 23న ఉదయం జీఎం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, తదుపరి ప్రగతి స్టేడియంలో జెండా ఆవిష్కరణ, స్టాల్స్ ఓపెనింగ్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ గృహాలకు బహుమతులు, శ్రీరాంపూర్ ఏరియా ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డీజీఎంలు అరవింద రావు, చిరంజీవులు, ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, వర్క్ షాప్ ఇంజనీర్స్ సతీష్ చక్రవర్తి, రవి కుమార్, సీనియర్ పీవో పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
– సింగరేణి డైరెక్టర్లు ఎన్. బలరాం, డి. సత్యనారాయణ రావు
– విజేతలకు బహుమతులు ప్రధానం
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి సంస్థ ఉద్యోగులు, అధికారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్, పా) ఎన్. బలరాం, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావులు అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ బంగ్లా ఏరియాలోని ఇల్లందు క్లబ్ లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 28 అధికారుల క్లబ్ సభ్యుల షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్ క్రీడల ముగింపు కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులు ఒకే చోట చేరి వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడం సంతోషకరమని, క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కార్పొరేట్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), సింగరేణి అధికారుల సంఘం ప్రెసిడెంట్ జక్కం రమేష్, ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధా కుమారి, అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్, క్రీడల కన్వీనర్ డాక్టర్ రమేష్ బాబు, కో – కన్వీనర్ తిరుపతి, అన్ని ఏరియాల అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– సింగరేణి ఎన్నికల్లో సిఐటియు కార్మిక సంఘాన్ని గెలిపించాలి
– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
ఆర్.కె న్యూస్, నస్పూర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ రాజలింగు అధ్యక్షతన నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) అనుబంధ రంగాల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఐదు జివోలను గెజిట్ చేసి అమలు చేయాలన్నారు. డిసెంబర్ 27న జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు దూలం శ్రీనివాస్, కుంటాల కుమార్, దాగం రాజారాం, నర్సింహులు, శోభ, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
– అయ్యప్ప మాలధారణతో భక్తి, క్రమశిక్షణ
– 3 జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
– నిప్పుల్లో నడిచిన 2 వేల మంది అయ్యప్ప స్వాములు
– అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన శ్రీరాంపూర్
మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం వద్ద హనుమాన్ మందిర్ లో శుక్రవారం అర్ధరాత్రి వరకు అయ్యప్ప స్వాముల మహా సంగమం, మండల పడిపూజ ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ శ్రీరాంపూర్ శాఖ అధ్యక్షులు బొడ్డు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు మేడవేన చందర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, 108 మంది మహిళలు, దివ్య జ్యోతులు, మంగళహారతులతో ఆర్కే 8 కాలనీ గణేష్ మందిర్ నుంచి బయలు దేరి శ్రీరాంపూర్ పురవీధుల్లో నగర సంకీర్తన, అయ్యప్ప స్వాములు పేటతుళ్ళి నృత్యాలతో శోభయాత్ర నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తి గీతాలతో, శరణుఘోష చేసుకుంటూ మంగళ వాయిద్యాలతో దేవతా మూర్తుల చిత్రపటాలతో శోభా యాత్రతో ప్రగతి స్టేడియం వద్ద గల హనుమాన్ మందిరానికి చేరుకున్నారు. అనంతరం కేరళ తాంత్రికులు సంజీవ నంబూద్రి గురు స్వామిచే అయ్యప్ప స్వాముల మహా సంగమం, మహా మండల పడిపూజ, 18 దివ్య పదునెట్టాంబడి కలుశాల పూజ, అభిషేకాలు నిర్వహించారు. 18 కళశాల పూజ 18 రకాల పూలాభిషేకం, నైవేద్యాలు ఏర్పాటు చేసి భక్తులను దైవ చింతనలో ముంచేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి, నడిపెల్లి దివాకర్ రావు, మాజీ జడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వర్ రావులు భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమల్ రావు , వనపర్తి రాజేష్ లు పాల్గొని పూజలు చేశారు. పూజ కోసం అరటి చెట్లతో నీలాద్రి, చారి గురుస్వాముల మిత్ర బృందంచే నిర్మించిన తాత్కాలిక పూజా మందిరాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ సందర్భంగా నంబూద్రి గురు స్వామి అయ్యప్ప దీక్షా వ్రత ప్రాశస్యాన్ని కేరళ తాంత్రిక పూజా విధానాన్ని వివరించి అయ్యప్ప స్వాములచే సామూహికంగా పడిపూజ చేయించారు. దీక్ష చేపట్టిన భక్తుల్లో భక్తి, క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. దీక్ష వారి నుంచి చెడు అలవాట్లు, వ్యసనాలు దూరం చేసుకొంటనే దీక్షకు సార్ధకత ఉంటుందన్నారు. మంచిర్యాల మార్వాడి కాలు భజన బృందం ఆలపించిన భక్తిగీతాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. భక్తి గీతాలు మనోరంజకంగా ఉన్నాయి. పూజా మందిరాలను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడం అందరికి కనువిందు చేసింది. పడి పూజకు మహారాష్ట్ర సిరివంచ , పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి అయ్యప్ప భక్తులు హాజరయ్యారు.
పాప ప్రక్షాలణకు నిప్పుల్లో నడిచిన అయ్యప్పలు…
శ్రీరాంపూర్ అయ్యప్ప స్వాములు, భక్తులు మహా మండల పడిపూజ కార్యక్రమంలో భాగంగా భక్తులు పాప ప్రక్షాలణకై భగభగ మండే ఎర్రటి నిప్పులు (అగ్నిగుండాలు)ల్లో 2 వేల మంది అయ్యప్ప స్వాములు నడిచారు. రాత్రి ఒంటిగంట వరకు కూడా ఎంతో ఆసక్తితో అఖండ భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పూజలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి శరణు ఘోష నామస్మరణతో శ్రీరాంపూర్ కాలనీ మారు మ్రోగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ శ్రీరాంపూర్ సలహాదారులు తోట వెంకటేశం, ప్రధాన కార్యదర్శి భాస్కరి రాజేశం, ఉపాధ్యక్షులు వంగ శివకుమార్, కార్యదర్శి ముల్కల్ల రవికృష్ణ, సాదుల సురేందర్, ఐలయ్య, హరీష్, శ్రావణ్, బన్నీ, సిహెచ్ లోహిత్, పుట్ట రవి, ప్రసాద్, బొద్దున రమేష్, చారి, రామలింగం, కుమారస్వామి, ఆర్ మధు, క్రాంతి, దాసరి నవీన్, సీహెచ్ సదానందం, వేణు, రమేష్, శివారెడ్డి, బొద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, రంజిత్, ఐలయ్య, వంగ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్
మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సురిమిళ్ల వేణు మాట్లాడుతూ సోనియా జన్మదినం రోజున తెలంగాణ ప్రకటన వచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు, 12 వార్డు కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖలీద్, జిల్లా యూత్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ భూపతి శ్రీనివాస్, మండల జనరల్ సెక్రటరీ దారవేణి తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు అట్కపురం సతీష్, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంగిడి రాజేష్, మండల యూత్ అధ్యక్షుడు నరిగే నరేష్ ,అసెంబ్లీ యూత్ జనరల్ సెక్రటరీ అజయ్ గౌడ్, నాయకులు రాచకొండ బుజ్జన్న, రంగారావు, కురిమిల్ల మహేష్, ఎంబడి కుమార స్వామి, పోషం, సంజీవ్, పోతురాజల రమేష్, గోపతి తిరుపతి, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
– జీఎంలు జక్కం రమేష్, బి. సంజీవ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని జనరల్ మేనేజర్ కార్పొరేట్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) జక్కం రమేష్, శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. శనివారం నస్పూర్ పట్టణంలోని సింగరేణి బంగ్లా ఏరియా ఇల్లందు క్లబ్ లో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, సింగరేణి వ్యాప్తంగా ఉన్న 28 అధికారుల క్లబ్ సభ్యులకు టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న అధికారుల కుటుంబ సభ్యులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని, క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలని కోరారు.ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం సింగరేణి సంస్థలో ఉండడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను పక్కనపెట్టి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు రాధా కుమారి సంజీవరెడ్డి, అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్, క్రీడల కన్వీనర్ డాక్టర్ రమేష్ బాబు, కో – కన్వీనర్ తిరుపతి, అన్ని ఏరియాల అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– టీబీజీకేఏస్ నాయకుల పై చేస్తున్న దుష్ప్రచారాన్ని కార్మిక వర్గం తిప్పికొట్టాలి
– టీబీజీకేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్
సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధించిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికే దక్కుతుందని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3 గనిపై బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ద్వార సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా కార్మికులకు 60 కి పైగా హక్కులు తీసుకువచ్చామని, సింగరేణి కార్మిక వర్గాన్ని ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందన్నారు. కారుణ్య నియామకాలు, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ల ద్వారా 19 వేలకు పైగా ఉద్యోగాలు సింగరేణిలో వచ్చేలా చేశామని, 190 మస్టర్స్ నిండిన బదిలీ వర్కర్లను సంవత్సరంలోపు పర్మనెంట్ చేయించిన చరిత్ర టీబీజీకేఎస్ కు ఉందన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సింగరేణి 49 శాతం వాటాను కేంద్రానికి అప్పజెప్పే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఏమాత్రం పట్టించుకోలేదని, కార్మికులకు అన్యాయం చేయాలని చూసిందన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లకు కార్మిక వర్గాన్ని ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, పర్సెంట్ విద్యుత్ చార్జీల రద్దు, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, క్యాడర్ స్కీమ్ సమస్య పరిష్కారం, పారదర్శకంగా సర్ఫేస్ జనరల్ మజ్దూర్ లకు అవకాశం కల్పించడం, మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు, 10 లక్షల వడ్డీ లేని గృహ రుణంతో ఒక్కొక్క కార్మికుడికి దాదాపు నెలకు 4 నుంచి 5 వేల రూపాయలు మేలు జరుగుతుందని, ఇలాంటి ఎన్నో హక్కులు సాధించిన టీబీజీకేఎస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని అన్నారు. కొంతమంది టీబీజీకేఎస్ నాయకుల పై యూనియన్ మారతారని దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్య నాయకులు ఎవరు యూనియన్ మారరని, దుష్ప్రచారాన్ని కార్మిక వర్గం తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు డికొండ అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, ఏరియా జిఎం చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి,పెట్టం లక్ష్మణ్, కాశి రావు, బ్రాంచ్ సెక్రటరీలు పానుగంటి సత్తయ్య, కానుగంటి చంద్రయ్య, బ్రాంచ్ నాయకులు అన్వేష్ రెడ్డి, చెరాలు, పిట్ సెక్రటరీ రిక్కల గోపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సాదుల భాస్కర్, నాయకులు గోపి నాయక్, ఉత్తేజ్ రెడ్డి, సుధాకర్, మైన్ కమిటీ,సేఫ్టీ కమిటీ క్యాంటీన్ కమిటీ, టెంపుల్ కమిటీ నాయకులు, షిఫ్ట్ సెక్రటరీలు, యువ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు విలువ తెలియపరుస్తూ మంచిర్యాల జిల్లా విద్యాశాఖకు చెందిన గెజిటెడ్ హెడ్ మాస్టర్, కవి, రచయిత, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ ఓటేద్దాం రండి అనే “ఓటరు చైతన్య గీతం” రాసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు ఆయనను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ,అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్(ఎల్.బి), ఎస్.మోతిలాల్ (రెవెన్యూ) విద్యాశాఖాధికారి ఎస్.యాదయ్య వేర్వేరుగా అభినందించారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేసే ముందు ఎలా ఆలోచించి ఓటు వేయాలో అవగాహన కలిగించే ఓటరు చైతన్య గీతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఓటర్లను ఎంతగానో ఆలోచింపజేస్తుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను చూసిన పలువురు యోగేశ్వర్ ను అభినందిస్తున్నారు. ఈ గీతాన్ని జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు గానం అందించగా, సంగీతం వేణు తిరునగరి సమకూర్చారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ “జయహో భారత్” యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు.
గాలి, వెలుతురు సరిగ్గా లేని చీకటి బొగ్గు గనుల్లో 30 నుంచి 40 సంవత్సరాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డ బొగ్గు గని విశ్రాంత కార్మికులు దేశ వ్యాప్తంగా ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర దక్షిణ భారత దేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో నివసిస్తున్నారు. సింగరేణిలో సుమారు 80,000 మంది, కోల్ ఇండియాలో ఐదు లక్షల మంది కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం పెన్షన్ పొందుతున్నారు. వీరికి కనీస పెన్షన్ 350 రూపాయలు నిర్ణయించారు.
25 సంవత్సరాలు గడిచినప్పటికీ వీరికి పెన్షన్ పెరుగుదల లేక పోవడం బాధాకరం. గత రెండు నెలల క్రితం కనీస పెన్షన్ 350 రూపాయల నుంచి 1,000 రూపాయలకు పెంచే నిర్ణయం జరిగినప్పటికీ అమలు కావడం లేదు. ఇది కూడా నేటి కాలమాన పరిస్థితులకు సరిపోదు. సింగరేణిలో 1,000 రూపాయలు పెన్షన్ పొందే వారు దాదాపు 20,000 మంది కడు దీన స్థితిలో జీవిస్తున్నారు. కోల్ మైన్స్ స్కీం నిబంధన ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్ష జరిపి సవరించాలని నిబంధన అమలు కావడం లేదు. కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని 2019 డిసెంబర్ 19న ఒక రోజు, 2022 జూలై 22 నుంచి 25 వరకు మూడు రోజులు, 2022 డిసెంబర్ 5న ఒక రోజు, న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 27 మార్చి 2023న ప్రధాన మంత్రి పార్లమెంట్ నియోజక వర్గం వారణాసి లో ధర్నా, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులకు, ప్రధానమంత్రి, వివిధ కేంద్ర శాఖల మంత్రులకు పెన్షన్ పెంపుకై వినతి పత్రాలు సమర్పించారు. చట్ట సభల్లో 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించి నూతన చట్టాలు రూపొందించడంలో ఉన్న ఆసక్తి కోల్ మైన్స్ పెన్షన్ స్కీం 1998ను సవరించి కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంచే దిశగా పార్లమెంట్ సభ్యులు ప్రయత్నించకపోవడం అత్యంత బాధాకరం. గతంలో పెన్షన్ ఫండ్ దుర్వినియోగం వలన పెన్షన్ ఫండ్ క్షిణించింది. ఫండ్ బలోపేతం కొరకు ప్రస్తుతం దేశంలో అమ్మకం అయ్యే ప్రతి టన్ను బొగ్గు పై 10 రూపాయలు పెన్షన్ ఫండ్ కు బొగ్గు సంస్థలు జమ చేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ బలోపేతం కొరకు కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాలు ప్రతి టన్ను బొగ్గు అమ్మకాల్లో 5% పెన్షన్ ఫండ్ కు జమ చేస్తే పెన్షన్ ఫండ్ లో లోటు లేకుండా విశ్రాంత కార్మికులకు పెన్షన్ పెంచవచ్చు.
కోల్ మైన్స్ పెన్షన్ పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారిదే. కానీ, కొన్ని హక్కులు ప్రమోషన్ పాలసీ కోల్ ఇండియా కన్నా ఎక్కువగా సింగరేణిలో ఉన్నాయి. ఇక్కడ సింగరేణిలో లాభాల వాటా కార్మికులకు ప్రతి సంవత్సరం చెల్లిస్తూ, ఈ సంవత్సరం 32 శాతం అనగా దాదాపు 700 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లాభాల్లో కార్మికులకు వాటా చెల్లింపు లేదు. ఇది సింగరేణి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు. కోల్ ఇండియాలో లాభాల వాటా కార్మికులకు ఇవ్వడం లేదు. ఉచిత కరెంట్ సింగరేణి ఉద్యోగులకు సంస్థ ఇస్తుంది. కోల్ ఇండియాలో ఈ సౌకర్యం లేదు. అలాగే క్వాటర్స్ నందు ఏసీ సౌకర్యం సింగరేణిలో ఉంది. కోల్ ఇండియాలో లేదు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49% ఉంది. రాజకీయ పార్టీలు విశ్రాంత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ద్వారా రిటైర్డ్ బొగ్గు కార్మికులకు సౌకర్యాలు కల్పించవచ్చు.
బొగ్గు విశ్రాంత కార్మిక కుటుంబాలకు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింపు లేదు. వయోభారం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికేర్ స్కీం (సిపిఆర్ఎంఎస్) మెడికల్ కార్డు తీసుకొని ఒప్పంద ఆసుపత్రులకు వెళ్లితే అక్కడ తిరస్కరిస్తున్నారు. నేటి ధరలకు అనుగుణంగా కరువు భత్యంతో కూడిన పెన్షన్ లేకపోవడంతో వీరు పేదరికంలో జీవిస్తున్నన్నప్పటికీ పేద తరగతి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికల సీజన్ లో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు బొగ్గు గనుల ప్రైవేటీకరణ, ఆదాయ పన్ను రద్దు, జనాకర్షణ గ్యారెంటీ స్కీమ్ ల హామీల వర్షం కురిపిస్తున్నారు. మరి బొగ్గు వెలికి తీసి జాతికి వెలుగు నిచ్చిన బొగ్గు విశ్రాంత కార్మికుల బాగోగులు గురించి పలకరించే వారు కరువయ్యారు. బొగ్గు విశ్రాంత కార్మికులకు కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంపు, ఉచిత అపరిమిత వైద్య సేవలు అందించాలని రాజకీయ పార్టీలను వేడుకుంటున్నారు.

✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.



