నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా రగ్బీ జట్టును అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని కెజిఎ డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ లో అండర్ 15 బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, రగ్బీ క్రీడను అన్ని మండలాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే విధంగా శిక్షణ శిబిరలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కెజిఎ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కుమార్, కోచ్ రమేష్, పీఈటి లు దేవేందర్, వెంకటేష్, సురేష్, ధరణ్, నరసింహులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- గుర్తింపు కార్మిక సంఘం నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఉపరితల గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు అన్నారు. సోమవారం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) నాయకులు శ్రీరాంపూర్ ఉపరితల గనిని సందర్శించి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు మాట్లాడుతూ, శ్రీరాంపూర్ ఉపరితల గని లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఓపెన్ కాస్ట్, సి.హెచ్.పి సెక్షన్ ను వేరు చేయాలని, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, సూపర్వైజర్ ల కొరత ఉందని, కార్మికులకు సరిపడా షేడ్స్ వెంటనే నిర్మించాలని, కార్మికులకు సరిపడా ప్లే డేలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను ఓసీపీ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లగా, సానుకూలంగా స్పందించిన ఓసీపీ మేనేజర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య , సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, ఫిట్ కార్యదర్శి మోతే లచ్చన్న, బ్రాంచ్ నాయకులు గండి సతీష్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు ఆళ్ల వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, దుబాల రవి తదితరులు పాల్గొన్నారు.
- నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు
ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల నియోజకవర్గంలో ఏ దాడులు జరిగినా, అరెస్టులు జరిగిన స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రోద్బలంతో జరుగుతున్నాయనే నిరాధార ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మానుకోవాలని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో దుర్గం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టీకి చెందిన కందుల ప్రశాంత్ ను స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేయించారని చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ నాయకులు లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి డబ్బులు వసూలు చేశారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కందుల ప్రశాంత్ తన ఇంటి సమీపంలో ఉండే దుర్గం వెంకటేశ్వర్లు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అతని సెల్ ఫోన్, లాప్టాప్ ను తీసుకోవడంతోపాటు దుర్గం వెంకటేశ్వర్లు, అతని తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని కులం పేరుతో దూషించడంతో బాధిత కుటుంబ సభ్యులు కందుల ప్రశాంత్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. అనంతరం దుర్గం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కందుల ప్రశాంత్ పై తాను చేసిన ఫిర్యాదు విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పూజారి తిరుపతి, మున్సిపల్ కౌన్సిలర్ మడిగ మల్లయ్య, డిసిసి సెక్రటరీ భూపతి శీను, నాయకులు కోడూరి విజయ్, గెల్లు మల్లేష్, మాజీ జిల్లా యువత అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యం
- మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలి
- సింగరేణి బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ. నాగేశ్వర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ పురోభివృద్ధిలో సంఖ్య పరంగా అధికంగా ఉన్న బీసీ ఉద్యోగుల పాత్ర కీలకమని సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ. నాగేశ్వర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని ఎస్.సి.ఓ.ఏ క్లబ్ లో సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం శ్రీరాంపూర్ ఏరియా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, యాక్టింగ్ బేస్డ్ ప్రమోషన్లలో రోస్టర్ విధానం ప్రకారం రిజర్వేషన్ అమలు జరగాలని, అధికారుల ప్రమోషన్ విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. సింగరేణి యాజమాన్యం 11 ఏరియాలకు లైజనింగ్ అధికారిని నియమించడంతో పాటు కార్యాలయ వసతి కల్పించాలని అన్నారు. రాజకీయ, వర్గ, కుల, మతాలకు అతీతంగా చేసే ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని అన్నారు. సింగరేణి యాజమాన్యం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని, అన్ని జీఎం కార్యాలయాల్లో జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని, శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియం పేరును మహాత్మ జ్యోతిరావు పూలే స్టేడియం అని మార్చాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బీసీ ఉద్యోగులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించి తమ హక్కులు సాధించుకోవాలని అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, బలపడి ముందుకు సాగాలన్నారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చీఫ్ లైజనింగ్ అధికారి నియామకం హర్షణీయమని అన్నారు. బీసీలు సమస్త సంపద సృష్టికర్తలని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ వర్గం పాలన జరగడం లేదన్నారు. రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని కోరారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షవర్గం ముస్కె సమ్మయ్య, పేరం రమేష్, పెట్టం లక్ష్మణ్, చీఫ్ అడ్వైజర్ చిలక శ్రీనివాస్, చీఫ్ లైజనింగ్ అధికారి పి. హరి శంకర్ రావు, యూనియన్ నాయకులు షేక్ బాజీ సైదా, జెట్టి శంకరరావు, శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జిఎం ఎన్. సత్యనారాయణ, డివైజియం (పర్సనల్) పి. అరవింద రావు, ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, ఏరియా ఎస్సీ లైజనింగ్ అధికారి కిరణ్ కుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్. రాజేశ్వరరావు, ఏరియా నాయకులు బరుపటి మారుతి, బద్రి బుచ్చయ్య, బీసీ సంఘం నాయకులు రంగు రాజేశం, కర్రె లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

- ఆర్.కె 7 గని ఇంచార్జి మేనేజర్ సంతోష్ రావు
- పదోన్నతి పత్రాలు అందజేత
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధిస్తూ సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని ఆర్.కె 7 గని ఇంచార్జి మేనేజర్ సంతోష్ రావు అన్నారు. సోమవారం ఆర్.కె 7 గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాటగిరి ప్రమోషన్ పొందిన 34 మంది ఉద్యోగులకు గని ఇంచార్జి మేనేజర్ సంతోష్ రావు పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్.కె 7 గని ఇంచార్జి మేనేజర్ మాట్లాడుతూ, పదోన్నతితో పాటు ఉద్యోగులపై బాధ్యత పెరుగుతుందని అన్నారు. పని స్థలాల్లో విధిగా రక్షణ సూత్రాలు పాటించాలని కోరారు. ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంస్థ ముందుంటుందని అన్నారు. అనంతరం ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావించాలని, ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సింగరేణి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంటిలేషన్ ఆఫీసర్ జగదీష్ రావు, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ మారపల్లి సారయ్య, అండర్ మేనేజర్లు రవీందర్, శశాంక్, ఇంజనీర్లు ప్రవీణ్, రమేష్, సంక్షేమ అధికారి సంతన్ తదితరులు పాల్గొన్నారు.
- మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారాం
- మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీసీలు, మున్నూరు కాపులు ఐక్యతతో సత్తా చాటాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తోట శ్రీనివాస్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులు ఉన్నారని చెప్పారు. బీసీలు రాష్ట్రంలో 56 శాతం ఉన్నారని, అందులో 18 శాతం మున్నూరు కాపులు ఉన్నారని పేర్కొన్నారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపులు ఐఖ్యతోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో కాపు ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి బాపురావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరెండ్ల శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, పట్టణ సమన్వయ కమిటీ సభ్యుడు మైదం రామకృష్ణ, పెంచాల వేణు, గుడాల మల్లేషం, ధర్ని మధూకర్, నాయకులు పడాల రవిందర్, వార్డు కన్వీనర్లు గాండ్ల ఆంజయ్య, పానగంటి సత్తయ్య, ఆకుల నరేందర్, ఆకుల లక్ష్మన్, రాళ్లబండి రాజన్న, గుమ్మడి తిరుపతి, అడె మధూకర్, సీపతి సదయ్య, అగ్గు సాగర్, పొగాకు రమేశ్, పెద్దపల్లి రామయ్య, రుకుం తిరుమల్, ఆకుల నరేందర్ పాల్గొన్నారు.
- బిజెపి నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం బిజెపి నస్పూర్ పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ, వివేకానందుని స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు అని అన్న స్వామి వివేకానంద మాటలు స్ఫూర్తిగా తీసుకొని లక్ష్య సాధనలో అంకితభావంతో ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని కోరారు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నయువతీ యువకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పబ్బతినేని కమలాకర్ రావు, కేశెట్టి నాగేశ్వరరావు, పోన్నవేని సదయ్య, కుర్ర చక్రవర్తి, కాదస్ భీమయ్య, మద్ది సుమన్, రవణవేణి శ్రీనివాస్, బద్రి శ్రీకాంత్, సత్యనారాయణ, నరేందర్, తిరుపతి, సుజిత్, రవి, రత్నం, రాకేష్, శ్రావణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- రెడ్డి పరివార్ క్యాలెండర్ ఆవిష్కరణలో వక్తలు
ఆర్.కె న్యూస్, నస్పూర్: రెడ్డి కులస్తుల్లో ఉండే పేదలకు ఆర్థికంగా, విద్యాపరంగా సహాయం అందించాలని వక్తలు ఆకాంక్షించారు. నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం 2025 క్యాలెండర్ ను ఆదివారం నస్పూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరిం చారు. అనంతరం నూతన కమిటీని పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంఘం నస్పూర్ గౌరవ అధ్యక్షుడు అనుమాండ్ల వెంకట్ రెడ్డి, అధ్యక్షుడు మోతె రాఘవరెడ్డి, జిల్లా కార్యదర్శి గొట్టం తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ, రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం స్థాపించిన నాటి నుంచి అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇదే మాదిరిగా మున్ముందు కొనసాగించాలన్నారు. రెడ్డిలు అంటే ఆర్థికంగా స్థిరపడిన ఉన్నత వర్గమనే భావన సమాజంలో ఉందని, కానీ రెడ్డిల్లోనూ పేదలున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు అందరం కలిసికట్టుగా ఉంటూ సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఇటీవల ఏర్పాటైన నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం కమిటీని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దూదిపాల విజయపాల్ రెడ్డి, గౌరవ సలహాదారులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాకాల మహిపాల్ రెడ్డి, కోశాధికారి చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కెడిక ప్రకాష్ రెడ్డి, పుప్పిరెడ్డి బాపురెడ్డి, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్లో పీఆర్టీయూటీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులుగం దామోధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఉపాద్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేజీవీబీల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. త్వరలో జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం బలపరిచిన అభ్యర్థులు వంగ మహేందర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డిలను మొదటి ప్రాధ్యానత ఓటు వేసి గెలిపించాలన్నారు. అప్పుడే శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతు వినబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, తన హయాంలో మహిళా టీచర్లకు అధనంగా 5 సీఎల్స్, మెటర్నీటీలీవ్లు మంజూరు చేయించామన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తనను ఉపాధ్యాయ ప్రతినిధిగా శాసన మండలికి పంపాలన్నారు. తాను గెలిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
- జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిక
ఈ సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బచ్చ మోహన్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా నిచ్చకోల మహేశ్వర్ , రాష్ట్ర అసోసియేట్ సభ్యునిగా బిల్లా తిరుపతయ్య, మీడియా ఇంచార్జీగా కే తిరుపతిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొండు జనార్ధన్, అధ్యక్షులు కొట్టె శంకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు శాంకరీ, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి
- ఆర్.కె 6 ఎస్ఓఎం ఈ. తిరుపతి
ఆర్. కె న్యూస్, నస్పూర్: 1975వ సంవత్సరంలో ప్రారంభమైన రవీంద్రఖని 6 గని ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంటుందని, 50 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని గని ఎస్ఓఎం ఈ. తిరుపతి అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గని ఎస్ఓఎం మాట్లాడుతూ, ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి సూర్యనారాయణ, ఆర్.కె 5,6 గ్రూప్ గనుల ఏజెంట్ ఎన్. శ్రీధర్ ల మార్గదర్శకత్వంలో ప్రమాద రహిత ఉత్పత్తి సాధిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో ఏరియాలోని అన్ని గనులకు రవీంద్రఖని 6 గని ఆదర్శంగా నిలిచిన ఆర్.కె 6 గని ఈ ఏడాది ఆగస్టు మాసం వరకు నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం గనిలో 758 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, యువ ఉద్యోగులు గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. పని స్థలాల్లో విధిగా రక్షణ పరికరాలు, రక్షణ సూత్రాలు పాటించాలన్నారు.గనిలో మొత్తం 29.80 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా ప్రస్తుతానికి 14.78 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీసినట్లు, ఇంకా 13.95 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. గనిలో జి–9, జి–12 గ్రేడ్ బొగ్గు ఉందని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వంద శాతం పైగా ఉత్పత్తితో సింగరేణిలోనే ఉత్తమ గనిగా పేరు ఉందని, తెలిపారు. ఉత్పత్తితో పాటు 2024 సంత్సరంలో ప్రమాద రహిత భూగర్భ గనిగా నిలవడం గొప్ప విషయమని తెలిపారు. ప్రస్తుతానికి 106 శాతానికి పైగా ఉత్పత్తి సాధిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గని సేఫ్టీ ఆఫీసర్ కె. శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ మర్రి కొమురయ్య, వెంటిలేషన్ ఆఫీసర్ ఆర్. రాం నర్సయ్య,సీనియర్ సర్వేయర్ ఎస్.పి వర్మ, వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్. సురేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.



