– తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడకు ముప్పు పొంచి ఉందని ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి 4 యేండ్లు అయ్యాయని, కార్మికులు ఆకాంక్ష మేరకు గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలన్నారు. సింగరేణిలో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సంస్థలో కార్మికులకు ఇచ్చే జనరల్ మజ్దూర్ పదోన్నతులకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలు 6 కొత్త భూగర్భ గనులు, సొంతింటి పథకం, పేర్ల మార్పు, డిపెండెట్ల వయసు పెంపు, సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరించడం లాంటి వాటిపై టీబీజీకేఎస్ మాట్లాడడం లేదన్నారు. యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రద్దు చేసి, స్టాట్యుటరీ కమిటీల్లో అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిథ్యం కల్పిస్తే ఎన్నికలు పెట్టమని అడగమన్నారు. గత నెల 30న ఓటర్ లీస్ట్ ఇవ్వాలనే ఆదేశాలను యాజమాన్యం పట్టించుకోకపోవడం పై కోర్టుకు పోతామని తెలిపారు. కార్మికుల వద్ద ఎన్నికలు నిర్వహించాలంటూ పలికే కొన్ని కార్మిక సంఘాలు ఆర్ఎల్సి ముందు జరిగే సమావేశంలో ఎందుకు పాల్గొనడంలేదో కార్మికులు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ముస్కె సమ్మయ్య, కె. వీరభద్రయ్య, తౌటం మల్లేష్, రాంచందర్, లచ్చన్న, లక్ష్మణ్, మురళీ చౌదరి, నవీన్ రెడ్డి, అప్రోజ్ ఖాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
– శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్
– భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం
ఆర్.కె న్యూస్, నస్పూర్: 2023-24 ఆర్ధిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం మాట్లాడుతూ, గత నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని తెలిపారు. రాబోయే 6 నెలలు బొగ్గు ఉత్పత్తికి కీలకమని అన్నారు. సెప్టెంబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఉత్పత్తి 89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్కే5 గని 105 శాతం, ఆర్కే6 గని 115 శాతం, ఆర్కే7 గని 102 శాతం, ఆర్కే న్యూటెక్ గని 106 శాతం, ఎస్సార్పీ 1 గని 74 శాతం, ఎస్సార్పీ3 గని 92 శాతం, ఐకె1ఎ గని 79 శాతంతో భూగర్భ గనులు 96 శాతం సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 70 శాతం, ఐకె ఓసిపి 125 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత నెలలో ఆర్కే 8, నస్పూర్ డిస్పెన్సరీలో 3 లక్షల విలువ గల కొత్త ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి తెచ్చామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 500 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశామని, గైర్హాజరు కార్మికుల కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించమని తెలిపారు. గత నెలలో 41 మంది ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ పిఓ కాంత రావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థలో సుదీర్ఘ కాలం పని చేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని ఆర్కే-న్యూటెక్ గని ఎస్.ఓ.ఎం ఇ.స్వామిరాజు అన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గని ఎస్.ఓ.ఎం ఇ.స్వామిరాజు శాలువలు, పూలమాలతో ఘనంగా సన్మానించి, సన్మాన పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆర్కే-న్యూటెక్ గని ఎస్.ఓ.ఎం మాట్లాడుతూ సింగరేణి ప్రగతిలో ఉద్యోగుల సేవలు మరువలేనివని అన్నారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు తదుపరి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇన్ఛార్జి రక్షణాధికారి శంకర్, పిట్ ఇంజినీర్ రాజగోపాలచారి, ఇంజినీర్ కృష్ణ, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, అండర్ మేనేజర్లు పరమేష్, చంద్రమౌళి, తెబొగకాసం, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శులు ఎం.జంపయ్య, ఎ.లక్ష్మణ్, బీఎంఎస్ ప్రతినిధి వినయ్ కుమార్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: విజ్ఞానం కోసం విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా స్థాయి జిజ్ఞాస సంచార ప్రయోగశాల నిర్వహకులు సాయి కుమార్, సంపత్ లు తెలిపారు. శుక్రవారం నస్పూర్ మండలంలోని సింగపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లా సైన్స్ ఆఫీసర్ మధుబాబు పర్యవేక్షణలో విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించారు. మానవ శరీరం, అంతర్గత అవయవాల పనితీరు, ప్రయోగ పరికరాల పని విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మహేశ్వర్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
– రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం రాధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అచ్చెల్లి – చింతకుంట వంతెన, శివపూర్ – హీరపూర్ వంతెన ప్రారంభించడం జరిగిందని, శివపూర్ – హీరాపూర్ రోడ్డుకు భూమి పూజ, పాతట్లగూడ వంతెన ప్రారంభించడం జరిగిందని, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మన్నేవార్ సంఘం భవనానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. కౌటాల మండలంలో మొఘడ్ దగడ్ – వైగాం రోడ్డుకు భూమి పూజ, వార్థా నదిపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గుండాయిపేట్ – నందివర్థా (మహారాష్ట్ర) మధ్య హైలెవల్ అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి భూమి పూజ, చింతల మానేపల్లి మండల కేంద్రంలో 133 కె . వి. సబ్ స్టేషన్ కు భూమి పూజ, చింతల్ పాటి – గురుడుపేట్ రోడ్డుకు, చింతలమానేపల్లి – గంగపూర్ రోడ్డుకు, కర్జెళ్లి – బారేగూడ రోడ్డుకు భూమి పూజ, దిందాలో లో-లెవల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల 4 వేల 16 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని, మహిళా సంక్షేమం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు సకాలంలో సరైన పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ కిట్, ప్రసవం తర్వాత బాలింతలకు కె సి ఆర్ హిట్ అందించడం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన తరగతులు, మైనారిటీల కొరకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని అందించడం జరుగుతుందని, గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరం భారతదేశంలోనే విభిన్న సంస్కృతులకు నిలయంగా సుందర నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం క్రీస్తుశకం 1591లో కుతుబ్ షాహీ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా చేత చార్మినార్ కేంద్రంగా, మూసి నది ఒడ్డున నిర్మించబడింది.హైదరాబాద్ నగరం నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో రాజధానిగా పేరు గాంచింది. హైదరాబాద్ లో తరచుగా వరదలు వచ్చేవి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున 2 గంటలకు “క్లౌడ్ బరస్ట్” వలన విపరీతంగా వర్షం కురిసింది.1908 సెప్టెంబర్ 28న వరద ఉధృతంగా ప్రవహించి మూసి నది 60 అడుగులకు చేరింది. ఈ వరదల వలన అఫ్జల్ గంజ్ లోని కోల్ సవాడి, ఘన్సీ బజార్ లో అత్యధిక నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయి, 80 వేల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. 1860లో నిర్మించిన నిజాం ఆసుపత్రిని ధ్వంసం చేసి అఫ్జల్ ముసల్లం జంగ్, చాదర్ ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. స్థానిక భాషలో ఈ వరదలను “తుగ్యాని సితంబర్” అని పిలిచేవారు. ఆనాటి వరదల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 200 ఏండ్ల నాటి చింత చెట్టు ఎక్కి 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విపత్కర పరిస్థితిని చూసి హైదరాబాద్ స్టేట్ ఆస్థాన జ్యోతిష్యుడు “జుమర్ లాల్ తివారి” సలహా మేరకు నిజాం రాజు “మహబూబ్ అలీ ఖాన్” ధోతి ధరించి మూసీ నదిని శాంతింపజేసేందుకు హిందూ మతాచార ప్రకారం నదికి పూలు, పండ్లు, కొబ్బరి కాయలు, పట్టు చీర, బంగారం, వెండి, ముత్యాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. వరద సంక్షోభ సమయంలో నిజాం రాజు తన రాజభవనం తెరిచి ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఇలాంటి వరదలు మరల రాకుండా 1912 లో “సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు” ఏర్పాటు చేసి నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నగర పునర్నిర్మాణం కొరకు సలహాలు సహకారం అందించాలని నిజాం రాజు అలనాటి ప్రఖ్యాత ఇంజినీర్ ” మోక్షగుండం విశ్వేశ్వరయ్య” ను ఆహ్వానించి ఆయన సలహా మేరకు హైదరాబాద్ కు ఉత్తరాన కొన్ని మైళ్ళ దూరంలో రిజర్వాయర్లు నిర్మించారు. ప్రఖ్యాత ఇంజనీర్ “నవాబ్ జంగ్ బహదూర్” ఆధ్వర్యంలో 1920లో మూసీ నదికి అడ్డంగా “ఉస్మాన్ సాగర్” 1927లో ఈసీ (మూసి ఉపనది) పై “హిమాయత్ సాగర్” నిర్మించి హైదరాబాద్ కు తాగు నీటితో పాటు వరదలు నియంత్రించబడ్డాయి.

✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.
– మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాజకీయాలకు అతీతంగా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. గురువారం నస్పూర్ మున్సిపాలిటీలోని 19, 14, 22, 13, 24, 25, 15 వార్డుల్లో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా ప్రజలకు ప్రేమ్ సాగర్ రావు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని అన్నారు. వరదల సమయంలో అధికారులు ఎవరూ స్పందించకపోయినా తాము స్పందించామన్నారు. ఎండాకాలంలో ప్రజలకు నీటి ఎద్దడి తీర్చేందుకు వాటర్ ట్యాంకుల ద్వారా గోదావరి నీటిని అందించామన్నారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు సైతం కరోనా, వరద ప్రభావిత సమయాల్లో పారిపోతే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు సేవలు అందించారని గుర్తు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ సాగర్ రావు ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్
ఆర్.కె న్యూస్ ,నస్పూర్: ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. గురువారం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ సింగపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ ఆయన సతీమణి స్రవంతితో కలిసి స్థానిక మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమని, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, కరోనా సమయంలో కోవిడ్ సోకిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని, చనిపోయిన వారికి ఆర్థిక సహాయం, వరద బాధితులకు సహాయం, నిరుద్యోగులకు ఉచిత పోలీస్, గ్రూప్స్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రం రమేష్, పానుగంటి మధు, కుర్రే చక్రి, రంగు రమేష్, పులి కిష్టయ్య, మర్త నారాయణ, మార్త శంకర్, కుర్రే లింగయ్య, ముత్యాల రాయమల్లు, కోట శంకర్, జుమ్మిడి రాజేష్, కొండ వెంకటేష్, అంబాల సాగర్, సిరికొండ రాజు, రూప దేవి, స్వప్న రెడ్డి, సుమలత, కొంతం మహేందర్, బద్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 జయంతి వేడుకలు నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకై అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులు తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకాని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శి వేముల సురేష్, శ్రీలక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి కుసుమ శంకర్, నల్ల సంపత్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: సిమెంట్ ఇటుకల చాటున గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సీపీ మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రం, మల్కన్ గిరి జిల్లా, చితాపరి గ్రామానికి చెందిన చిత్రసేన్ క్రిసాని, జగబందు క్రిసాని అనే అన్నదమ్ములు ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేవారని, ఈ నెల 22న రవాణా చేస్తున్న క్రమంలో రాత్రి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం దగ్గర నేషనల్ హైవే పక్కన టైరు పంక్చర్ కావడంతో ట్రాక్టర్ ను అక్కడే వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. ఈనెల 23న పెట్రోలింగ్ చేస్తున్న శ్రీరాంపూర్ ఎస్ఐ ట్రాక్టర్ వద్ద ఎవరు లేకపోవడంతో సిబ్బందితో పోలీస్ స్టేషన్ కు తరలించారని, ట్రాక్టర్ కోసం ఎవరు రాకపోవడంతో అనుమానంతో 25న తనిఖీ చేయగా సిమెంట్ ఇటుకల కింద టేపు చుట్టి ఉంచిన 93 (465 కిలోలు) గంజాయి ప్యాకెట్లు కనిపించాయని తెలిపారు. అనంతరం గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో పంచనామా నిర్వహించామన్నారు. గంజాయి విలువ 93 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా రవాణా చేస్తున్నారని, గంజాయి అక్రమ రవాణాలో కీలక వ్యక్తులు ఈశ్వర్, గురులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఏసీపీ బి. మోహన్, శ్రీరాంపూర్ సిఐ జి. రమేష్ బాబు, టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సుధాకర్, ఎస్ఐలు ఎం. ప్రసాద్, కె. రాజేష్, ఉపేందర్, రాజ వర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



