ఆర్.కె న్యూస్: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో ఈ నెల 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయక స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
KYATHAM RAJESH
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి విభాగంలో పూర్తి సర్వీస్ కాలం పనిచేసి పదవీ విరమణ పొందిన గొల్లపల్లి కనకయ్యను కార్యాలయ ఆవరణలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ మాట్లాడుతూ… సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం పాత్ర కీలకమైనదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని అన్నారు. పదవీ విరమణ ఉద్యోగి విధి నిర్వహణలో కంపెనీకి చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ తదుపరి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ పోగుల స్వామి, జూనియర్ ఇన్స్పెక్టర్ సిర్ర రాజయ్య, జమ్మేదార్ లు ఎస్.కె.దాస్, బడికెల రాం చందర్, గుర్తింపు సంఘం పిట్ సెక్రెటరీ ఆడెపు మల్లికార్జున్, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- అభివృద్ధి పనులకు ఈ నెలలో శంకుస్థాపన
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని, రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో అపోహలు వద్దని, సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతోంది తప్ప ఏ రైతుకు నష్టం జరగదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… మంచిర్యాల నియోజకవర్గంలో ఈ నెలాఖరు లోపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపడతామని, శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరవుతారని చెప్పారు. రాళ్లవాగు వరద ముంపు రాకుండా కరకట్ట నిర్మాణం చేపడతామని, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. ముల్కల్ల నుంచి బసంత్ నగర్ వరకు గోదావరి నదిపై 375 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదన వెళ్లాయని తెలిపారు. 164 కోట్లతో శ్రీనివాస గార్డెన్ నుండి క్వారీ రోడ్, పాత మంచిర్యాల మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. తాను ఏ హోదాలో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అవినీతి సహించబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు భూ ఆక్రమణదారులకు మద్దతు ఇవ్వడం శోచనీయమని అన్నారు. తదుపరి మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🔴 కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 11న చేపట్టిన చలో కొత్తగూడెం కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జూన్ 21 నుండి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గని కార్మికులను చైతన్య పరచడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని, హామీలు నెరవేర్చకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని తెలిపారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం లేకుండా నామినేషన్ పద్దతిలో సింగరేణి సంస్థకు కేటాయించాలన్నారు. కేంద్రంలో 3వ సారి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తుందని, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి పరిరక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. సింగరేణి యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించడం లోపాయికారి ఒప్పందం కోసం చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. గని కార్మికుల కోసం, సంస్థను రక్షించుకోవడానికి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాడుతామని తెలిపారు. రిటైర్డ్ జనరల్ మేనేజర్లు 5 సంవత్సరాల వరకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల్లో చేరకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు తిప్పారపు సారయ్య, ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్, టీజిఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి చాంద్ బాషా, ఎస్సిసిడబ్ల్యూయు రాష్ట్ర అధ్యక్షులు డి. బ్రహ్మానందం, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జైపాల్ సింగ్, టీఎన్టీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మని రామ్ సింగ్, టిడిపి పెద్దపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తలారి రాజు, ఎస్జీఎల్బికేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం పోషమల్లు, రాష్ట్ర అధ్యక్షులు జి. రామన్న, టీజిఎల్బికేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రామన్న, డివిజన్ నాయకులు సారయ్య తదితరులు పాల్గొన్నారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు చేయూత అందించాలి
- తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: రాజ్యాధికారంతోనే కుల సంఘాలు బలోపేతం అవుతాయని, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శనివారం మంచిర్యాలకు వచ్చారు. మంచిర్యాల పట్టణంలోని ఓ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీల స్థితిగతులు పరిశీలించడంతో పాటు రాజకీయ చైతన్యం పెంపొందించడానికి జిల్లాల పర్యటన చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 18 నియోజకవర్గాల్లో పద్మశాలీలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలు గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు చేయూత అందించాలని కోరారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్న భీమాకు సంబంధించిన 6 కోట్ల రూపాయల చెక్కును రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి వారికి అందిచినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మంచిర్యాల జిల్లాలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పద్మశాలి యువత విద్యతో పాటు పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని అన్నారు. యువత సేవా దృక్పథం, పోటీతత్వం అలవర్చుకోవాలని, రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో పద్మశాలీల బలోపేతానికి కృషి చేస్తున్న పలువురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. ఈ మేరకు వారికి ధృవ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రాంచందర్, కోశాధికారి బొమ్మ రఘురాం, కార్యదర్శి చిలువేరు సదానందం, యూత్ అధ్యక్షులు అవ్వారి భాస్కర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గాదాసు బాపు, గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్, యూత్ అధ్యక్షులు బింగి ప్రవీణ్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు రాం సత్తయ్య, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
- సింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి
- సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ మేకల దాసు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని, అధిక ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నస్పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ మేకల దాసు తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్ లో మాట్లాడుతూ, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5,17వ వార్డు లోని హిమ్మత్ నగర్ కొంత భాగం, ఆర్.కె 8 కాలనీ, భగత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్, కృష్ణ కాలని ప్రాంత వాసులకు సింగరేణి స్థలాన్ని రెవెన్యూకు అప్పగించి జీవో నెంబర్ 76 ద్వారా ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాల నుండి సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, అధిక ధరలు నియంత్రించాలనే డిమాండ్లతో సెప్టెంబర్ 2న ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శ్రీరాంపూర్ కార్యదర్శి పూజారి రామన్న, సహాయ కార్యదర్శి కొత్తపల్లి మహేష్, జక్క మొగిలి, సర్వ శ్రీనివాస్, తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- హెచ్ఎంఎస్ నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా వర్క్ షాప్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హెచ్ఎంఎస్ నాయకులు అన్నారు. ఈ మేరకు శుక్రవారం హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ డీజీఎం రవీందర్ కు కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడుతూ… వర్క్ షాప్ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్ నమోదులో పూర్తిగా తప్పుల తడకగా నమోదు అయ్యాయని తెలిపారు. వెంటనే ప్రత్యేక సిబ్బందిని నియమించి వర్క్ షాప్ లోనే సరి చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగినప్పటి నుండి ఎక్కడా లేని విధంగా అవుట్ మాస్టర్ మూడు గంటలకు బదులుగా 20 నిమిషాలు ఆలస్యంగా నమోదు చేస్తున్నారని, గతంలో మాదిరిగా 3 గంటలకే అవుట్ మాస్టర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాష్ రూమ్ లేక మహిళా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి వాష్ రూములు, రెస్ట్ హాళ్లు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి అనిల్ రెడ్డి, వర్క్ షాప్ పిట్ కార్యదర్శి పొన్నగంటి అశోక్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం లక్ష్మణ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించి ఉన్నత స్థాయిలో నిలవాలని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతాయని, విద్య పై ఏకాగ్రత పెరుగుతుందని, స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు అలవడుతాయని, జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలను సాధించడంలో దోహదపడతాయని అన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని, వీటిని సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తితో నిజ జీవితంలో ముందుకు వెళ్ళాలని అన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ఖో-ఖో, బాక్సింగ్ లో ఈ పాఠశాల నుండి ఇద్దరు బాలికలు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారని, ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడా రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్, పుస్తకోపహార్, పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం తదితర అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ జె. ప్రసాద్, ఉపాధ్యాయులు పి. క్రిష్ణా రావు, ఎస్. భాస్కర్, శుభి గుప్తా, సంధ్య, సచిన్, నగేష్, విద్యార్థినీ, విద్యార్థులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- ఎన్.హెచ్.ఆర్.సి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపతి రాములు
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన హైడ్రా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపతి రాములు అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.హెచ్.ఆర్.సి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో కబ్జాదారులు పాగా వేసుకున్నారని, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. జిల్లాలో హైడ్రాను కొనసాగించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఆర్.సి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్, క్యాతం రాజేష్, ఉప్పులేటి రవి, తలారి సమ్మయ్య, కుమ్మరి సతీష్, గురునాధం నరేందర్ గౌడ్, ఆవుల శ్రీధర్, దాసరి నరేందర్, కలవేన స్వామి తదితరులు పాల్గొన్నారు.
- సర్వం కోల్పోయి నిరాశ్రయులైన రెండు కుటుంబాలు
ఆర్.కె న్యూస్, చెన్నూరు: కాయకష్టం చేసుకుని బ్రతికే రైతు కుటుంబాలు వాళ్ళవి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారి కుటుంబాల్లో గ్యాస్ సిలిండర్ రూపకంగా వారి కుటుంబాలను రోడ్డున పడేసింది. వివరాల్లోకి వెళితే చెన్నూరు మండలం ఆస్నాద్ గ్రామంలో నేడు జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇంగిలి లింగన్న, ఇంగిలి శ్రీనివాస్ లకు చెందిన ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుడు ఇంగిలి లింగన్న మాట్లాడుతూ… వ్యవసాయం చేసుకుని బ్రతికే తాము యథావిధిగా ఉదయం పూట ఇంటి పనులు ముగించుకుని వ్యవసాయ పని నిమిత్తం పొలం పనులకు వెళ్లామని, ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి తన బిడ్డ పెళ్లికోసం తీసుకు వచ్చిన ఎనిమిది తులాల బంగారం, నాలుగు లక్షల రూపాయలు, నిత్యావసర సరుకులు, ఇంటి సామాన్లు కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక బాధితుడు లింగన్న తమ్ముడు ఇంగిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… తన అన్న ఇంటి పక్కన ఇల్లు ఉండటంతో తన ఇల్లు కాలిపోయి సర్వస్వం కోల్పోయానని, తన భార్యకు చెందిన నాలుగు తులాల బంగారం, అన్న బిడ్డ పెళ్లి కోసం దాచిన రెండు లక్షల రూపాయలు, ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యిందని కన్నీరు మున్నీరు అయ్యాడు. ప్రమాద విషయాన్ని గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా స్పందించిన అధికారులు త్వరిత గతిన వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే రెండు ఇండ్లు కాలి బూడిదయ్యాయి. అనంతరం పోలీసులు, గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కళ్ళముందు రెండు ఇండ్లు కాలిపోతుంటే గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి.



