ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్, నస్పూర్ జోన్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు సోమవారం రాస్తారోకో నిర్వహించాయి. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షులు సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి మాట్లాడుతూ సీసీసీ కార్నర్ వద్ద బస్టాండు, పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి స్థలాల్లో నివాసాలు ఏర్పరుచుకున్న వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఎన్నికల వాగ్దానం ప్రకారం రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమితో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. పట్టణంలో శాశ్వత డంప్ యార్డ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారుల్లో వీధిదీపాలు, కాలనీల్లో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కుక్కల బెడదను నివారించాలని, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి సారథ్యంలో మంచిర్యాల కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వంగపల్లి వెంకటేశ్వరరావు, మిట్టపల్లి మొగిలి, జీవీ ఆనంద్ కృష్ణ, సుమన్ యాదవ్, బూర్ల చిరంజీవి, కొయ్యడ పద్మ, కట్కూరి తిరుపతి, రవణవేణి శ్రీనివాస్, మిడిదొడ్డి సతీష్, తరాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.







