44 వార్డుల్లో ఘన విజయం.. విపక్షాలు బహు దూరం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ధీమా వ్యక్తం చేసిన ప్రేమ్ సాగర్ రావు అంచనాలకు తగ్గట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ ఎన్నికల్లో విపక్షాలు నామమాత్రపు స్థానాలకే పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ 08 వార్డుల్లో, బీజేపీ 05 వార్డుల్లో, ఏఐఎఫ్ బీ 02 వార్డుల్లో, జనసేన ఒక వార్డులో విజయం సాధించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ విజయానికి తోడ్పడ్డాయి. అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు విజయవంతమయ్యాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఈ ఫలితాలు నిరూపించాయని నాయకులు పేర్కొంటున్నారు. తొలిసారి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యకర్తలు పట్టణంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో మంచిర్యాల తొలి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను అధిష్టించే అదృష్టం ఎవరికి దక్కుతుందో తెలుసుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై అటు ప్రజలు, ఇటు పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.







