ముల్కల పాఠశాలలో వైద్య శిబిరం.. స్కూల్ హెల్త్ సర్వే నిర్వహించిన మెడికల్ విద్యార్థులు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి. శ్రీకాంత్ పేర్కొన్నారు. సోమవారం ముల్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్ సర్వే, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. విద్యార్థుల శారీరక స్థితిగతులను అంచనా వేసి అవసరమైన చికిత్స అందించారు. ప్రాథమిక దశలోనే ఆరోగ్య సమస్యలను గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని డాక్టర్ జి. శ్రీకాంత్ తెలిపారు. మెడికల్ విద్యార్థులు ప్రతి విద్యార్థి ఎత్తు, బరువు, కంటి చూపును పరీక్షించారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్నవారిని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య సహాయక సిబ్బంది విద్యార్థులకు వైద్య సేవలు అందించడంలో చురుగ్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశం, డాక్టర్ సౌజన్య, డాక్టర్ సుమలత పాల్గొన్నారు.







