– రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
మునుపెన్నడూ జరుగని విధంగా తెలంగాణ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ -కోప లక్ష్మీ. సుంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో 312 కోట్ల 96 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 25 కోట్ల ప్రత్యేక నిధులు, 15 కోట్ల డి.ఎం.ఎఫ్.టి. నిధులు మొత్తంగా 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, 15.16 కోట్ల రూపాయలతో రామకృష్ణాపూర్ పట్టణంలో నిర్మించిన 286 రెండు పడక గదుల ఇండ్ల ప్రారంభించడం జరిగిందని, 50 కోట్ల రూపాయలతో గాంధారి వనం వద్ద 250 ఎకరాలలో నిర్మించే కె.సి.ఆర్. ఆర్బన్ పార్క్ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియంలో జి.ఓ. 76లో భాగంగా 7వ విడత సింగరేణి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఈ క్రమంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించడం జరుగుతుందని, రైతులతో పాటు యువతకు ఉపాధి కల్పించే దిశగా 500 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ సాగు ఫ్యాక్టరీ నిర్మించేందుకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో నెలకు 12 వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 1 లక్షా 50 వేల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వారు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ మైదానం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, సమ్మక్క-సారలమ్మ భవనం, పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా 50 కోట్ల రూపాయలతో కె.సి.ఆర్. అర్బన్ పార్క్, 50 పడకల మాతాశిశు కేంద్రం, 18 వంతెనలు, కుందారం, మందమర్రి, రామకృష్ణాపూర్ లలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన వారికి జి.ఓ.76 ద్వారా పట్టాలు అందించి యాజమాన్య హక్కులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 1 వేయి 658 కోట్ల రూపాయలతో చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1 లక్ష ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందుతుందని అన్నారు. రామారావుపేట, కుమ్మరికుంట, పెద్దచెరువు లాంటి ఎన్నో చెక్ డ్యామ్ లు, రైతు వేదికలు, గ్రంథాలయాలు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి 5 ఏండ్లలో చేయడం జరిగిందని చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో శుభవార్త వింటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో చెన్నూర్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయని, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ ద్వారా కృషి చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, అకస్మాత్తుగా రైతు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడకుండా రైతుభీమా అందించడం జరుగుతుందని, మహిళా సంక్షేమంలో భాగంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కె.సి.ఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు, కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 12 వేల కోట్లు ఉన్న సింగరేణి సంస్థ టర్నోవర్ నేడు 33 వేల కోట్లు అయిందని, 419 కోట రూపాయల ఉన్న లాభాలు 430 శాతంతో 2 వేల 222 కోట్ల రూపాయలు అయిందని, 18 శాతం ఉన్న లాభాల బోనస్ ను 32 శాతానికి పెంచి అందించడం జరుగుతుందని అన్నారు. 9 సంవత్సరాల కాలంలో కార్మికుల ఖాతాల్లో 2 వేల 700 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు. దసరా బోనస్ 715 కోట్ల రూపాయలు కార్మికులకు అందించడం జరుగుతుందని, దీపావళితో కలిపితే 1000 కోట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.