మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో సమీక్ష.. అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ప్రతి డివిజన్ ఆఫీసర్ తన విభాగాన్ని సొంత ఇల్లుగా భావించి బాధ్యతతో పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, డివిజన్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని 60 డివిజన్ల పరిధిలో ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మున్సిపల్ కార్మికులకు అవసరమైన వస్తువులు, దుస్తులను తక్షణమే అందజేయాలని కమిషనర్ అన్వేష్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకోవాలని హితవు పలికారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, నగరపాలక సంస్థ కమిషనర్ జి. అన్వేష్, మేనేజర్ కరుణాకర్, రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రాజేందర్, సానిటరీ సూపర్వైజర్ కుమారస్వామి, సానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం, వివిధ శాఖల అధికారులు, డివిజన్ ఆఫీసర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.







