🟢 గురువర్యులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నూతన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు బండి రమేష్ ఆకాంక్షించారు. 1992 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థి అయిన రమేష్ పదోన్నతిపై అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు, రాష్ట్ర పర్యావరణ చట్టం అథారిటీ సభ్యుడు గుండేటి యోగేశ్వర్ పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి ఘనంగా సన్మానం చేశారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత యోగేశ్వర్ తన శిష్యుడికి పచ్చని మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ తన గురువు ఆశీస్సులు తీసుకున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని రమేష్ పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయంగా విద్యాసంస్థను విజయవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వెల్లడించారు. చదువుకున్న పాఠశాలకే బాధ్యునిగా రావడం గర్వకారణమని అన్నారు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సమన్వయంతో పాఠశాల కీర్తిని మరింత పెంచుతానని వివరించారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







