పీఎంకేవీవై 4.0 కింద మూడు కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 పథకం కింద మూడు రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ టి. సుజాత తెలిపారు. 3డి ప్రింటింగ్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, సీఎన్సీ ప్రోగ్రామర్ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 4 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ శిక్షణ కాలపరిమితి మూడు నెలలు ఉంటుందని ప్రిన్సిపాల్ వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఐటీఐలో సమర్పించాలని సూచించారు. శిక్షణ సమయంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9704456295 నంబరులో సంప్రదించాలని తెలిపారు.







