మార్చి నుంచి నియామక ఉత్తర్వులు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న బదిలీ వర్కర్లకు మార్చి 2026 నుంచి జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో బదిలీ వర్కర్ నుంచి జనరల్ అసిస్టెంట్‌గా మారడానికి కనీసం మూడేళ్ల సమయం పట్టేది. ఈ సమస్యపై యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిబంధనల్లో మార్పు వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు భవిష్యత్తులో నియమితులయ్యే వారికి సైతం జనరల్ అసిస్టెంట్ ట్రైనీ హోదా లభిస్తుంది. వీరు 190 లేదా 240 మస్టర్లు పూర్తి చేయగానే ట్రైనీ నిబంధన తొలగిస్తారు. అనంతరం వారిని పూర్తిస్థాయి జనరల్ అసిస్టెంట్‌లుగా గుర్తిస్తారు. స్ట్రక్చర్ సమావేశాల్లో ఏఐటీయూసీ గట్టిగా గళం ఎత్తడం వల్లే ఈ నిర్ణయం వెలువడిందని రాజ్ కుమార్ పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సంఘం చేస్తున్న కృషిని బదిలీ వర్కర్లు గమనించాలని కోరారు.







