35వ డివిజన్లో ముమ్మర ప్రచారం.. సింగరేణి కార్మికులకు ఉచిత ఐటీ ఫైలింగ్ హామీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: 35వ డివిజన్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని దొమ్మటి కవిత-రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఆమె ఓటర్లను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి తనను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే డివిజన్ పరిధిలోని సింగరేణి ఉద్యోగులకు ఒక ప్రత్యేక హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులందరికీ ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేయిస్తానని స్పష్టం చేశారు. డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని వివరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో తాను 35వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు దొమ్మటి కవిత వెల్లడించారు. సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో విజయం చేకూర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, సింహం గుర్తుకే తమ మద్దతు ఉంటుందని ఓటర్లు హామీ ఇస్తున్నారని దొమ్మటి కవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రజా మద్దతుతో తన విజయం ఖాయమని వెల్లడించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







